ys jagan : హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరు తీసేసి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టడంపై ఊహించని యాంగిల్లో జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేకత బయటపడింది. కమ్మోళ్ళే అయినా తానెంతో నమ్మకం పెట్టుకున్నవాళ్ళల్లో ఇద్దరు జగన్ నిర్ణయాన్ని బహిరంగంగానే తప్పుపట్టారు. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా అధికార భాషా సంఘం ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేశారు. యార్లగడ్డ రాజీనామాను జగన్ ఊహించుండరు.
అలాగే గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేనివంశీ కూడా ప్రభుత్వనిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. నిజానికి ఎన్టీయార్ పేరు తీసేసి వైఎస్సార్ పేరు పెట్టినంతమాత్రాన వ్యక్తిగతంగా జగన్ కు లేదా వైసీపీకి జనాల్లో వచ్చే మైలేజీ ఏమీ ఉండదు. అయినా జగన్ ఆపనిచేశారంటే హిడెన్ అజెండా ఏదో ఉండే వుంటుందనటంలో సందేహంలేదు. అప్పట్లో ఎన్టీయార్ పేరును చంద్రబాబు పెట్టినా ఇపుడు ఎన్టీయార్ పేరును జగన్ తీసేసినా అంతా రాజకీయమే అనటంలో సందేహంలేదు.
ఇక్కడ గమనించాల్సిందేమంటే 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్య శ్రీని ఎన్టీయార్ ఆరోగ్యశ్రీగా మార్చారు. మరప్పుడు రాజీవ్ గాంధీ పేరును చంద్రబాబు ఎందుకు మార్చారు. రాజీవ్ పేరుమార్చేసి ఎన్టీయార్ పేరు పెట్టడం తప్పనిపించలేదా ? తర్వాత కొంతకాలం కాగానే ఎన్టీయార్ హెల్త్ సర్వీసెస్ అనే పథకం పేరును యూనివర్సల్ హెల్త్ సర్వీసు అని మార్చేయాలని స్వయంగా చంద్రబాబే అనుకున్నారు కదా. అలాగే 1995లో తాను సీఎం అవ్వగానే ఎన్టీయార్ పేరుతో ఉన్న సభ్యత్వనమోదు పుస్తకాలన్నింటినీ మూలనపడేయించారు. తన బొమ్మతో కొత్త సభ్యత్వ నమోదు పుస్తకాలను అచ్చేయించారు.
సరే ఇవన్నీ అందరికీ తెలిసినవే అయినా ఇపుడు యార్లగడ్డ తనపదవికి రాజీనామా చేయటమే ఆశ్చర్యంగా ఉంది. అసలు యార్లగడ్డకు జగన్ కు ఏమి సంబంధం ? ఏమీ లేకపోయినా కమ్మోరులో కాస్త పలుకుబడి, విస్తృతమైన పరిచయాలున్న వ్యక్తి అన్న కారణంగానే అధికార భాషా సంఘానికి ఛైర్మన్ గా నియమించారు. అలాంటి వ్యక్తే ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాజీనామా చేయటం మామూలు విషయం కాదు. కాబట్టి యార్లగడ్డ, వంశీ ఇద్దరు జగన్ కు షాకిచ్చారనే చెప్పాలి.