Janasena : పవన్ జాగ్రత్తగా ఉండకపోతే కష్టమేనా ?

Janasena : షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నకొద్దీ పార్టీలో చేరటానికి ఎవరెవరో వస్తుంటారు. అలా వచ్చినవారందరినీ చేర్చేసుకుంటే చివరకు పార్టీ ఇమేజి దెబ్బతినేస్తుంది. ఈ విషయంలో పార్టీ అధినేత పవన్ కల్యాన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు విషయం ఏమిటంటే సినీనటుడు పృధ్విరాజ్ జనసేనలో చేరబోతున్నారు. చేరబోతున్నారంటే ఏదో సభ్యత్వం తీసుకుని ఊరికినే కూర్చోరు కదా. ప్రచారమంటారు తర్వాత పోటీచేయటానికి కూడా రెడీఅయిపోతారు.

పార్టీవర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గంనుండి ఎంఎల్ఏగా పోటీచేయటానికి పృధ్విరాజుకు హామీకూడా దొరికిందట. ఈ నటుడి సొంతజిల్లా వైజాగ్ అంటున్నారు. కాబట్టి ఆ జిల్లాలో ఏదో నియోజకవర్గం నుండి పోటీచేయటానికి రెడీ అయిపోతుండచ్చు. అంతాబాగానే ఉందికానీ ఈ నటుడు మొదట్లో వైసీపీలో ఉండేవాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పిలిచి మరీ ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్ పదవిని ఇస్తే అక్కడ కంపు చేసుకున్నాడు. ఆడవాళ్ళతో అసభ్యంగా మాట్లాడటం, ఆ ఆడియో బయటకు వచ్చేయటంతో వేరేదారిలేక రాజీనామా చేశాడు.

సినిమా ఫీల్డులో కూడా ఇలాగే ఉంటాడేమో తెలీదు. అక్కడ ఏం చేసినా చెల్లుబాటు అయిపోతోంది కాబట్టి బయట కూడా అలాగే అనుకుని బోల్తాపడ్డాడు. ఛైర్మన్ పదవికి రాజీనామా తర్వాత జగన్ను కలిసే అవకాశం రాకపోయేసరికి వేరేదారిలేక పార్టీలో నుండి బయటకు వచ్చేశాడు. అంతే డిసిప్లిన్ గా ఉండకపోతే జరిగే నష్టానికి పృధ్విరాజ్ విషయమే ఒక ఉదాహరణ. తాను తప్పుచేసి దొరికిపోయి పదవి పోగుట్టుకున్నానని పృధ్వి అనుకోవటంలేదు. తనకు వ్యతిరేకంగా కుట్రచేసి ఆ కుట్రలో తనను ఇరికించి బయటకు పంపారనే గోలచేస్తున్నాడు. ఆ అక్కసుతోనే జగన్, వైసీపీ పైన నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

సరే పృధ్వి లాంటోళ్ళు మాట్లాడితే జగన్+వైసీపీకి ఏమైపోతుందనేది వేరే సంగతి. రేపు జనసేనలో చేరినతర్వాత కూడా పృధ్వి ఆడవాళ్ళ విషయంలో మళ్ళీ ఇలాగే వ్యవహరించేందుకు అవకాశమైతేవుంది. ఎందుకంటే పార్టీలో యాక్టివ్ గా ఉండే సమయంలో ఎంతోమందితో కలిసి పనిచేయాల్సుంటుంది. అందులో ఆడవాళ్ళు కూడా ఉంటారు. అలావాటుగానో లేకపోతే బలహీనతను ఆపుకోలేకో జనసేనలో వీరమహిళలతో కూడా ఇలాగే వ్యవహరిస్తే పార్టీ ఇమేజి డ్యామేజవుతుంది.

సినీసెలబ్రిటీ అనగానే ఎంతోమంది అట్రాక్టవుతుంటారు. అందులోను పృధ్వి చాలాస్పీడు కాబట్టి కంపయ్యే అవకాశముంది. ఇలాంటి వాళ్ళ విషయంలో పవన్ ముందుజాగ్రత్త పడకపోతే అదిచివరకు పవన్ మెడకే చుట్టుకునే అవకాశముంది. అందులోను ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇపుడు హిందుపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం ఎంత వైరల్ గా మారిందో అందరు చూస్తున్నదే. ఆడవాళ్ళ విషయంలో చాలా గొడవలు జరుగుతున్నట్లు ఇప్పటికే టీడీపీపై అనేక ఆరోపణలున్నాయి. కాబట్టి పవన్ జాగ్రత్తగా ఉండకపోతే కష్టాలు తప్పవని గ్రహించాలి.