Janasena క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. రీసెంటుగా జరిగిన రెండు డెవలప్మెంట్లను జాగ్రత్తగా గమనిస్తే ఈ విషయం అర్ధమైపోతుంది. పైకి నేతలు చెప్పుకున్నా చెప్పకపోయినా జనసేన-బీజేపీ నేతల మధ్య గ్యాప్ వచ్చేసిందన్నది వాస్తవం. అనధికారికంగా ఇపుడు రెండుపార్టీల మధ్య ఎలాంటి సంబంధాలులేవు. కాకపోతే తాము విడిపోయాము అనిమాత్రం రెండుపార్టీల నేతలు చెప్పుకోవటంలేదంతే. ఈ ముచ్చట కూడా హఠాత్తుగా ఎప్పుడో బయటపడుతుంది.
ఇపుడింతకీ విషయం ఏమిటంటే రెండుసందర్భాల్లో గ్యాప్ స్పష్టంగా బయటపడింది. మొదటిదేమో భీమవరంలో నరేంద్రమోడీ పర్యటించినపుడు. ఇక రెండోదేమో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు వీడ్కోలు విందు సందర్భంగా. మొదటి సందర్భం తీసుకుంటే అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా భీమవరంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఆ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు నరేంద్రమోడీ వచ్చారు. ఆ కార్యక్రమానికి జనసేన తరపున ప్రతినిధిని పంపమని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి చివరినిముషంలో ఆహ్వానం పంపారు.
ఇదే మంత్రి పదిరోజుల ముందే పవన్ సోదరుడు చిరంజీవికి ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు. ఆహ్వానం పంపటమే కాకుండా కచ్చితంగా హాజరుకావాలని కోరారు. మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కేమో ప్రతినిధిని పంపమని అడిగిన కిషన్ రెడ్డి చిరంజీవిని మాత్రం తప్పకుండా హాజరవ్వమని కోరటంఏమిటి ? అంటే ఇక్కడ ఉద్దేశ్యంఏమిటంటే నరేంద్రమోడీ కార్యక్రమంలో పవన్ పాల్గొనటం బీజేపీకి ఇష్టటంలేదు. అందుకనే ప్రతినిధిని పంపమని చెప్పారు. చివరకు జనసేన తరపున ఎవరు హాజరైనట్లు లేదు.
ఇదే విషయాన్ని పవన్ మాట్లాడుతు వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆహ్వానం పంపలేదుకాబట్టి తాను కూడా హాజరవ్వలేదని కవరింగ్ ఇచ్చుకున్నారు. నిజానికి రఘురాజుకు పవన్ కు ఏమి సంబంధం ? సరే ఈ విషయాన్ని వదిలేస్తే ఇక రెండో అంశం చూద్దాం. రామ్ నాథ్ కోవింద్ వీడ్కోలు విందుకు రమ్మని ప్రధానమంత్రి కార్యాలయం నుండి ఆహ్వానం అందినా పవన్ వెళ్ళలేదు. తనకు ఒంట్లో బావోలేదని చెప్పి విందులో పాల్గొనలేదు.
ఈ రెండు ఘటనలు చూసిన తర్వాత బీజేపీకి దూరంగా ఉండాలని పవన్ డిసైడ్ చేసుకున్నట్లే అనిపిస్తోంది. కలిసి ప్రయాణంచేయటం సాధ్యంకాదని అర్ధమైపోయిన తర్వాత ఎవరైనా ఇలాగే చేస్తారనటంలో సందేహంలేదు. నిజానికి 2019 ఎన్నికల తర్వాత రెండుపార్టీలు పొత్తుపెట్టుకోవటమే ఆశ్చర్యమనిపించింది. ఎందుకంటే ఏ కోణంలో చూసినా రెండుపార్టీలకు ఏ విషయంలోను పొసగదు. పవన్ ఆలోచనలు వేరు, బీజేపీ నేతలు ఆలోచనలు వేరుగా ఉంటాయి.
అందుకనే పేరుకు మిత్రపక్షాలే అయినా ఇప్పటివరకు కలిసి ఒక్క కార్యక్రమం కూడా చేసిందిలేదు. తన పర్యటనల్లో పవన్ బీజేపీని ఇన్వాల్వ్ చేయటంలేదు. అలాగే బీజేపీ నిర్వహించిన సభలకు పవన్ను పిలవలేదు. దేనికదే అన్నట్లుగా ఉండేకన్నా విడిపోయి దేనికదిగా ఉండటమే మంచిదని పవన్ అనుకున్నట్లున్నారు. అందుకనే దూరంగా ఉంటున్నారు.