Janasena: అందరు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఇంతకీ ఆ సమయం ఏమిటంటే మునుగోడు కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామా, స్పీకర్ ఆమోదం. రాజగోపాల్ కాంగ్రెస్ ను వదిలేసి బీజేపీలో చేరుతారనే ప్రచారం చాలాకాలంగా ఉంది. అయితే ఎంఎల్ఏగా కూడా రాజీనామా చేయాలని బీజేపీ షరతు విధించటంతో ఓ మూడురోజులు కాస్త డ్రామానడిచిందంతే. చివరకు ఎంఎల్ఏగా రాజీనామా చేసిన రాజగోపాల్ సోమవారం స్పీకర్ పోచారం శ్రీనివాసులరెడ్డిని కలిసిన నిముషాల వ్యవధిలోనే రాజీనామా ఆమోదంపొందింది.
రాజీనామా ఆమోదంపొందిందంటే ఉపఎన్నికకు తెరలేచినట్లే. రాజీనామా విషయాన్ని అసెంబ్లీ నుండి కేంద్ర ఎన్నికల కమీషన్ కు చేరగానే ఏదోరోజు ఉపఎన్నిక నోటిఫికేషన్ వస్తుంది. అది ఈరోజా లేకపోతే డిసెంబర్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ సాధారణ ఎన్నికలతో కలిపా అనేది కమీషన్ నిర్ణయిస్తుంది. సరే కమీషన్ పని ఎలాగూ కమీషన్ చేస్తుంది కాబట్టి ఈలోగా రాజకీయపార్టీలు చేయాల్సింది అవిచేస్తాయి. రాజీనామా చేసిన రాజగోపాల్ బీజేపీ అభ్యర్ధిగా రంగంలోకి దిగటం ఖాయం.
మరి కాంగ్రెస్ తరపున ఎవరు పోటీచేస్తారు ? టీఆర్ఎస్ అభ్యర్ధి ఎవరనేది తేలాలి. కాంగ్రెస్ తరపున మూడు, నాలుగు పేర్లు వినబడుతున్నాయి కాబట్టి ఎవరో ఒకరు ఖాయమవుతారు. అలాగే కేసీయార్ బుర్రలో కూడా ఎవరో ఒకరు ఉండేవుంటారనటంలో సందేహంలేదు. బహుశా నోటిఫికేషన్ వచ్చే సమయానికి అభ్యర్ధిపేరు బయటపడుతుందేమో. మరి మిగిలిన పార్టీల పరిస్ధితి ఏమిటి ? మిగిలిన పార్టీలంటే వైఎస్సార్టీపీ, జనసేన, వామపక్షాలు మాత్రమే. వీటిల్లో మిగిలిన రెండుపార్టీల సంగతిని వదిలేసినా అందరి దృష్టి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీదే ఉంది. ఎందుకంటే ఒంటరిగా పోటీచేసినా కనీసం 30 సీట్లలో గెలుపు అవకాశాలున్నట్లు స్వయంగా ఒకపుడు పవనే ప్రకటించుకున్నారు కాబట్టే.
ఇపుడు ఉపఎన్నికలో పవన్ ఏమి చేయబోతున్నారు అనేది పాయింట్. సొంతంగా పార్టీ తరపున అభ్యర్ధిని పోటీలోకి దింపితేనే పార్టీకి గౌరవం ఉంటుంది. అలాకాకుండా బీజేపీ ఒత్తిడికి లొంగిపోయి ఉపఎన్నిక నుండి తప్పుకుంటే ముందు ముందు ఇబ్బందులు తప్పవు. తెలంగాణాలో పార్టీసత్తా ఏమిటో తేలియాలంటే కచ్చితంగా జనసేన పోటీచేయాల్సిందే. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జరిగినట్లు జరిగితే పవన్ మాటకు విలువుండదు. ముందు అభ్యర్ధులను ప్రకటించేసి తర్వాత బీజేపీ ఒత్తిడికి లొంగిపోయారు.
పోటీనుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన పవన్ మాటకు బీజేపీ పెద్దలు విలువ ఇవ్వలేదు. అవసరానికి ఇంటికి పోయి మరీ ఒప్పించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లాంటివాళ్ళు తర్వాత మాత్రం పవన్ను అసలు పట్టించుకోలేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ పావులు కదపాల్సుంటుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో జనసేన పోటీచేసేది వాస్తవమే అయితే ఇపుడు మునుగోడు ఉపఎన్నికలో పోటీచేయాల్సిందే. లేకపోతే పవన్ మాటను ఎవరు నమ్మరంతే.