pawan Kalyan: పొత్తుల విషయంతో పాటు పోటీచేసే సీట్లపైన కూడా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వచ్చేసింది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉన్నపుడు అప్పుడే తొందర ఏమొచ్చిందని మీకు అనిపించచ్చు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉన్నది ఏపీలో. అదే తెలంగాణాలో వచ్చే ఏడాది డిసెంబర్లోనే ఎన్నికలు జరగాలి. ఇదే సమయంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం రోజు రోజుకు పెరిగిపోతోంది. కాబట్టి పవన్ తొందరపడకపోతే చాలా ఇబ్బందులు పడాల్సొస్తుంది.
ఇక్కడ విషయం ఏమిటంటే జనసేనకు ఏపీలో పొత్తుంది కానీ తెలంగాణాలో లేదు. ఆ మధ్య జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన కూడా పోటీచేస్తుందని పవన్ ప్రకటించారు. అయితే హఠాత్తుగా తెలంగాణాలో బీజేపీ సీనియర్ నేతలు రంగంలోకి దిగి పవన్ కు నచ్చచెప్పారు. దాంతో గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీచేయటం లేదని పవన్ ప్రకటించారు. నిజానికి తన అభ్యర్ధులను పోటీనుండి ఉపసంహరింప చేసుకోవటం పవన్ కు ఇష్టంలేదనే ప్రచారం అప్పట్లోనే జరిగింది.
అయినా సరే అభ్యర్ధులను వెనక్కు తీసుకున్నారంటే అందుకు కారణం బీజేపీ సీనియర్ నేతల నుండి వచ్చిన ఒత్తిడనే చెప్పాలి. సరే అప్పట్లో ఏదో జరిగిపోయింది మరి భవిష్యత్తు మాటేమిటి ? రాబోయే సాధారణ ఎన్నికల్లో తెలంగాణాలో జనసేన పోటీచేస్తుందా ? చేయదా ? అనే విషయంలో పవన్ ఒక క్లారిటి ఇచ్చితీరాలి. పోటీ చేస్తుందంటే ఒకపద్దతి, పోటీలో ఉండదనుంటే మరోపద్దతిని అనుసరించాలి. ఎలాగంటే పోటీలో ఉంటే తెలంగాణాలో కూడా బీజేపీతో పొత్తుంటుందా ఉండదా అనేది కీలకమైనది. తెలంగాణాలో బీజేపీ నేతలు జనసేనను అసలు లెక్కేచేయటంలేదు. కాబట్టి పవన్ తో తమకు పొత్తు అవసరం లేదని కమలనాదులు అనుకుంటున్నారు.
బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇదే విషయాన్ని డైరెక్టుగానే చెప్పేశారు. తమ రెండుపార్టీల మధ్య పొత్తుండని బండి ఎప్పుడో చెప్పేశారు. మరి పొత్తుండదని అనుకున్నపుడు జనసేన తెలంగాణాలో పోటీచేస్తుందా చేయదా అనే విషయంలో నేతల్లో అయోమయం పెరిగిపోతోంది. తెలంగాణా ఎన్నికల విషయంలో పవన్ తీసుకున్న నిర్ణయం ఏపీ ఎన్నికల విషయంలో కూడా కచ్చితంగా పడుతుంది. ఏపీకన్నా ఏడాది ముందే తెలంగాణాలో ఎన్నికలు జరిగిపోతాయి కాబట్టి బీజేపీ సీనేంటో తెలిసిపోతుంది.
అధికారంలోకి వచ్చేస్తుందని బీజేపీపై ఎవరికీ భ్రమలు లేకపోయినా ఎన్నిసీట్లలో గెలుస్తుందనేది కీలకమైంది. గౌరవప్రదమైన స్ధానాల్లో బీజేపీ గెలిస్తే ఏపీలో బీజేపీ నేతలు రెచ్చిపోవటం ఖాయం. అప్పుడు పవన్ బీజేపీని తేలిగ్గా తీసుకునే అవకాశంలేదు. అదే బీజేపీ షో ఫ్లాప్ అయితే ఏపీలో బీజేపీ నేతలను పవన్ లైట్ తీసుకునే అవకాశముంది. అప్పుడు తెలంగాణాలో పరిస్ధితిని చూపించి ఏపీలో బీజేపీ నేతలను పవన్ ఒత్తిడిలోకి నెట్టే అవకాశముంది. కాబట్టి తెలంగాణాలో పోటీ విషయమై పవన్ ఏదో నిర్ణయం తీసుకునే సమయం వచ్చేసింది.