Janasena : పారిశ్రామికవేత్తలు జనసేన వైపు చూస్తున్నారా ?

Janasena : షెడ్యూల్ ఎన్నికలకు ఉన్న సమయం ఇక రెండేళ్ళు మాత్రమే. చివరి ఏడాది ఎటూ ఎన్నికల సంవత్సరమే. కాబట్టి మహాఅయితే ఎన్నికలకు ఉన్నది ఏడాది మాత్రమే అనుకోవాలి. అందుకనే అన్నీ పార్టీల్లోను ఎన్నికల హడావుడి మొదలైపోయింది. ఎన్నికలన్నాక అత్యంత కీలకమైన అంశం నిధులు. అధికారంలో ఉందికాబట్టి వైసీపీకి చాలాకాలం అధికారంలో ఉందికాబట్టి ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కూడా రాబోయే ఎన్నికల్లో నిధుల సమస్య ఉండదనే అనుకోవాలి.

అంతాబాగానే ఉంది మరి జనసేన మాటేమిటి ? టీడీపీతో పొత్తుంటుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఒకవేళ పొత్తుంటే జనసేన అభ్యర్ధుల ఖర్చులను టీడీపీ భరిస్తుందని అనుకుందాం. మరి పొత్తులేకపోతే జనసేన పరిస్ధితేమిటి ? అందుకనే సొంతంగా నిధులు సమకూర్చుకునే మార్గాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ చూసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ పారిశ్రామికవేత్త తంగెళ్ళ ఉదయశ్రీనివాస్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ సమక్షంలో పార్టీలో చేరారు.

టీ టైమ్ ఔట్ లెట్ల పేరుతో శ్రీనివాస్ కు 17 రాష్ట్రాల్లో 3 వేల ఔట్ లెట్లున్నాయి. వీటిల్లో సుమారు 20 వేలమంది పనిచేస్తున్నారు. ఇన్నివేలమందికి ఉపాధి కల్పిస్తున్నారంటే పెద్ద పారిశ్రామికవేత్త అనే అనుకోవాలి. అంటే ఆర్ధికంగా కూడా బాగా సౌండ్ పార్టీకిందే లెక్క. ఇలాంటి సౌండ్ పార్టీలే ఇపుడు పార్టీకి చాలా అవసరం. సౌండ్ పార్టీయే కాబట్టి, తూర్పుగోదావరి జిల్లా కడియం ప్రాంతానికి చెందిన వ్యక్తే కాబట్టి ఏదో లోక్ సభ నుండి పోటీచేసే ఆలోచనతోనే పార్టీలో చేరుంటారు. ఈయనే కాకుండా పశ్చిమగోదావరి జిల్లాలోని ఉంగుటూరుకు చెందిన శ్రీలక్ష్మీ నారాయణ ఫండేషన్ ఛైర్మన్ పత్సమట్ల ధర్మరాజు+బోర్డు సభ్యులు కూడా జనసేనలో చేరారు.

ఎన్నికలకు ఎంతో దూరంలేదు కాబట్టి ఎంతమంది పారిశ్రామికవేత్తలు చేరితే పార్టీకి అంతటి ఆర్ధికబలం వస్తుంది. ఆర్ధికంగా బలంగా ఉన్నవారిలో అత్యధికులు లోక్ సభకు పోటీచేయటంపైనే ఎక్కువగా ఇంట్రస్టు చూపిస్తారు. ఒకపు కాకినాడకు చెందిన చెలమలశెట్టి సునీల్ లాంటి పారిశ్రామికవేత్తలు ప్రజారాజ్యంపార్టీ నుండి జనసేనలో చేరారు. ఇప్పటికీ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు కొందరున్నా సరిపోరు. ఎంతమంది పారిశ్రామికవేత్తలుంటే పార్టీకి అంతమంచిదన్న విషయం అందరికీ తెలిసిందే.

ఆర్ధికంగా గట్టిగా లేకపోయినా అనేక కారణాల వల్ల అసెంబ్లీ అభ్యర్ధులుగా కొందరికి టికెట్లివ్వాల్సొస్తుంది. అలాంటివారిని ఆదుకునేది ఇలాంటి పారిశ్రామికవేత్తలే. సో క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే తొందరలోనే మరింతమంది పారిశ్రామికవేత్తలు జనసేనలో చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఏ పారిశ్రామికవేత్త ఏ పార్టీలో చేరినా ముందు ఎంతోకొంత సర్వే చేయించుకుని, పార్టీల స్ధితిగతులు తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి పారిశ్రామికవేత్తలు జనసేనలో చేరుతున్నారంటే వాళ్ళకి ఏదో ప్లస్ పాయింట్లు కనబడితేనే కదా చేరుతున్నది. కాబట్టి పవన్ కు మనమూ ఆల్ ది బెస్ట్ చెబుదామా ?