janasena: ప్రచారానికి మరో స్టార్ దిగుతున్నారా ?

janasena:  వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం చేయటానికి మరో స్టార్ దిగబోతున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ స్టార్ ఎవరంటే మెగాస్టార్ కుటుంబంలోని రామ్ చరణట. ఇప్పటివరకు రామ్ చరణ్ రాజకీయవాసనలు తగలకుండా జాగ్రత్తగానే ఉన్నారు. అవటానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సొంత బాబాయే అయినా ఎక్కడా పార్టీ గురించి కానీ బాబాయ్ రాజకీయాలగురించి కానీ చరణ్ మాట్లాడలేదు. బహుశా తండ్రి, మెగాస్టార్ చిరంజీవి గైడెన్సు ఏమన్నా ఉందేమో తెలీదు.

ఇలాంటి చరణ్ వచ్చే ఎన్నికల్లో జనసేనకు ప్రచారం చేయబోతున్నారంటు స్వయంగా పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ చెప్పారు. ఒక టీవీ డిబేట్ లో బొలిశెట్టి మాట్లాడుతు బీజేపీకి జూనియర్ ఎన్టీయార్ ప్రచారం చేస్తే తమకు మరో స్టార్ రామ్ చరణ్ ప్రచారం చేస్తారని అన్నారు. బీజేపీకి జూనియర్ ప్రచారం చేస్తారనే ప్రచారానికి కంటర్ గా బొలిశెట్టి రామ్ చరణ్ పేరు ప్రస్తావించారో ఏమో తెలీదు. కానీ తెరవెనుక ఏదో జరగకపోతే హఠాత్తుగా చరణ్ పేరును ప్రస్తావించే వ్యక్తికాదు బొలిశెట్టి.

నిజానికి పవన్ కల్యాణే పెద్ద సెలబ్రిటీ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఫ్యాన్ బేస్ చూసుకుంటే పవన్ కన్నా పెద్ద బేస్ ఉన్న సెలబ్రిటీ మరొకరు లేరనే చెప్పాలి. అయినా ఈ ఫ్యాన్ బేస్ 2019 ఎన్నికల్లో పనికిరాలేదు. అందుకనే వచ్చే ఎన్నికలకు ఇప్పటినుండే పవన్ జాగ్రత్తపడుతున్నట్లున్నారు. ముందు అభిమానులను ఒక లైనులో పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఎందుకంటే సినిమాల పరంగా పవన్ కు అభిమానులే అయినా ఓట్లవరకు జగన్మోహన్ రెడ్డికి వేశారు. ఈ విషయాన్ని స్వయంగా పవనే బహిరంగసభల్లో చెప్పారు.

అయితే వచ్చే ఎన్నికల్లో అలాంటి తప్పు జరగకుండా పవన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అభిమానులందరినీ ఓటర్లుగా మార్చుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. ఇందులో భాగంగానే మెగాకాంపౌడ్ నుండి రామ్ చరణ్ సేవలు కూడా వాడుకోవాలని అనుకుంటున్నట్లున్నారు. పవన్ సోదరుడు నాగుబాబు పార్టీలో ఉన్నా పెద్దగా ఉపయోగం లేదు. నాగుబాబు క్షేత్రస్ధాయి, పార్టీ ఆఫీసులో కన్నా ట్విట్టర్లోనే ఎక్కువ యాక్టివ్ గా ఉంటారు. ట్విట్టర్లో యాక్టివ్ గా ఉండటం వల్ల ఏమీ ఉపయోగముండదని బహుశా ఆయనకు తెలీటంలేదేమో.

సరే ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావటమే టార్గెట్ గా పవన్ పావులు కదుపుతున్నట్లు అర్ధమవుతోంది. ఏ కారణం వల్లయినా బీజేపీతో కటీఫ్ అయితే తనదారేదో తాను చూసుకోక తప్పదు. అప్పుడు ఒంటరిగా పోటీచేస్తారా ? లేకపోతే టీడీపీతో చేతులు కలుపుతారా అన్నది ఇప్పటికైతే కన్ఫ్యూజన్ గానే ఉంది. ఒకవేళ బీజేపీతోనే ఎన్నికలకు వెళ్ళినా రామ్ చరణ్ సేవలను ఉపయోగించుకోవాలని పవన్ అనుకోవటం తెలివైన నిర్ణయమే. ఎందుకంటే అమిత్ షా తో భేటీలో జూనియర్ ఏమి చెప్పారో ఎవరికీ తెలీదుకదా.