YsJagan : మూడు రాజధానుల విషయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వ్యూహమేంటో ఎవరికీ అర్ధం కావటంలేదు. ప్రతిపక్షాలకు, మామూలు జనాలకు అర్ధం కావటంలేదంటే అర్ధముంది. కానీ మంత్రులు, సొంతపార్టీ ఎంఎల్ఏలు, సీనియర్ నేతలకు కూడా అర్ధం కావటంలేదంటే ఏమిటర్ధం. మూడు రాజధానుల బిల్లును గతంలో ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. అప్పటికే కోర్టు విచారణలో ఉన్న బిల్లుపై హైకోర్టు చాలా ఘాటుగా స్పందించింది. మూడు రాజధానుల బిల్లు చట్టవిరుద్ధమని, రాజధానిపై చట్టాలు చేసే హక్కు అసెంబ్లీకి లేదని తీర్పిచ్చింది.
హైకోర్టు తీర్పుపై వెంటనే ప్రభుత్వం సుప్రింకోర్టులో అప్పీలు చేస్తుందని అందరు అనుకున్నారు. అయితే అప్పీలు చేయలేదు. తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జగన్ మాట్లాడుతు తొందరలోనే మూడు రాజధానులపై సమగ్రంగా కొత్త బిల్లును తీసుకొస్తామని ప్రకటించారు. దీన్ని పార్టీ జనాలు ఏమాత్రం ఊహించలేదు. సరే అప్పటి ప్రకటన ప్రకారం తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లోనే మళ్ళీ కొత్తగా బిల్లు పెడతారని అందరు అనుకున్నారు.

అయితే ఇపుడు కూడా మూడు రాజధానుల అవసరాన్ని జగన్ నొక్కి చెప్పారు. అలాగే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తారని అనుకున్నా అలాంటిదేదీ జరగలేదు. మూడురాజధానుల బిల్లును ఎందుకు పెట్టలేదా అని అందరు ఆలోచిస్తుండగానే హఠాత్తుగా హైకోర్టు తీర్పును సవాలు చేస్తు ప్రభుత్వం సుప్రింకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దాంతో ప్రభుత్వంలో లేదా జగన్ బుర్రలో ఎలాంటి ఆలోచనలున్నాయో అర్ధంకాక అందరు తలలు పట్టుకుంటున్నారు.
పనిలోపనిగా మూడు రాజధానుల విషయంలో తమ విజన్ జనాలందరికీ వివరించారు. ఇదే సమయంలో అమరావతి పేరుతో ఆ ప్రాంతంలో చేసిన అరాచకం, జనాలను చేసిన మోసం గురించి చెప్పారు. అలాగే చంద్రబాబు వైఖరి వల్ల రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలు ఏ విధంగా నష్టపోయాయో కూడా ఉదాహరణలతో సహా వివరించారు. హోలు మొత్తంమీద జగన్ చెప్పిందేమంటే పరిపాలనా రాజధానిగా వైజాగ్ వెళ్ళిపోవటం ఖాయమని. అమరావతిలో ఎట్టి పరిస్ధితిలోను రాజధాని నర్మించేది లేదని. మరి జనాలు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.