Chandrababu Naidu : కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో విజయవాడ వెళ్లిన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. కృష్ణాజిల్లా గన్నవరంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో విజయవాడ చేరుకున్న చంద్రబాబు దాడులు జరిగిన ప్రాంతానికి వెళ్లాలని భావించారు. ఎయిర్పోర్ట్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించడంతో చంద్రబాబు జిల్లా ఎస్పీ జాషువా పై ఆగ్రహంతో ఊగిపోయారు.
ఎయిర్ పోర్ట్ బయట వారి సంఖ్యలో ఉన్న పోలీసులను చూసి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని అన్నారు. ఇంతమంది పోలీసులతో ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. జిల్లా ఎస్పీ చంద్రబాబుకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించడంతో మండిపడ్డారు.
చంద్రబాబు ప్రజాస్వామ్యంలో ఉన్నాము గుర్తుపెట్టుకోవాలి పోలీసులు ఇది డెమోక్రసీ.. డెమోక్రసీలో కలవడానికి కూడా మనుషులు రాకూడదా.. నాకు కూడా తెలుసు. మిమ్మల్ని ఎలా డీల్ చేయాలో.. తమాషా అనుకోవద్దండి. అంత అమాయకంగా ఉన్నాను అనుకుంటున్నారు. హద్దులు ఉంటాయి దేనికైనా.. అని పోలీసుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు గన్నవరం వస్తారని ఉద్దేశంతో ఎయిర్ పోర్ట్ ప్రధాన రహదారిపై లారీలు అడ్డుగా నిలిపి ఉంచారు. పోలీసు వాహనాలతో చంద్రబాబు కాన్వాయ్ గన్నవరం మార్గంలో వెళ్లకుండా జాగ్రత్త వహించారు. చంద్రబాబు వాహనాలు రామవరప్పాడు రింగ్ దాటిన తర్వాత వాహనాలను తొలగించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి పోలీసులు అరెస్టు చేసిన టిడిపి నాయకుడు పట్టాభి నివాసానికి టిడిపి అధినేత చేరుకున్నారు. పట్టాభి భార్యను, కుటుంబాన్ని పరామర్శించారు పట్టాభి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని.. ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనను కలవడానికి వచ్చిన కార్యకర్తలను ఎందుకు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారని పార్టీ కార్యాలయం పై దాడి చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. గన్నవరం టిడిపి నేత చిన్న ఇంటికి వెళ్దామంటే వెళ్ళనివ్వరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు . గన్నవరం ఎయిర్ పోర్ట్ కు వస్తే వేల మంది పోలీసులను పెట్టారని పోలీసులు అంటే చులకన భావం అసహ్యం వేస్తోందన్నారు.