Janasena – BJP ఆంధ్రప్రదేశ్ లో జనసేన, బీజేపీ మధ్య దూరం పెరిగిపోతుందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా జనసేన వ్యవహారంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన నుంచి సరైన సహకారం లేదని అన్నారు. జనసేన నుంచి అందిన సహకారం ఎంతనేది వారి విజ్ఞతకు వదిలేస్తున్నాను అని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ బాగా పని చేస్తున్న ఏపీ లో బీజేపీ ఎదగకూడదనే కొందరు టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని అన్నారు.ఈ మాటలు ఎవరిని ఉద్దేశించినవి కావని తెలిపారు. సోము వీర్రాజు చేసిన ఈ వ్యాఖ్యలు పరోక్షంగా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించినవే అనే టాక్ పొలిటికల్ లీడర్స్ నుంచి గట్టిగా వినిపిస్తోంది. ఏపీలోని పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. ఉత్తరాంధ్రకు చెందిన బీజేపీ సిట్టింగ్ స్థానం కూడా టీడీపీ సొంతమైంది. ఇక్కడి నుంచి పోటీ చేసిన బీజేపీకి ఈసారి డిపాజిట్ కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో తమకు సహకరించని జనసేనపై బీజేపీ నేతలు అసంతృప్తితో ఉన్నారు.
ఇక ఇదే అంశం పై బీజేపీ నేత మాధవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జనసేనతో కలిసి బీజేపీ ప్రజల్లోకి వెళితేనే పొత్తు ఉందని ప్రజలు నమ్ముతారని అన్నారు. తమతో పవన్ కళ్యాణ్ కలిస రావడం లేదని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించాలని పవన్ కళ్యాణ్ ను కోరామని.. కానీ ఆయన స్పందించలేదని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని ఓడించమని చెప్పారు కానీ.. బీజేపీని గెలిపించాలని కోరలేదని.. జనసేనతో పొత్తు ఉన్నా.. లేనట్టే ఉన్నామని కామెంట్ చేశారు.
జనసేనపై తమకు నమ్మకం ఉందని, తమపై జనసేనకు నమ్మకం ఉందన్న మాజీ ఎమ్మెల్సీ మాధవ్.. రెండు పార్టీలు కలిసి పోరాటాలు చేయడం ద్వారా ప్రజల్లో తమపై నమ్మకం కలిగేలా చేయొచ్చని తెలిపారు. ఇలాంటి ప్రయత్నాలు జరగకపోవడం వల్లే రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నా.. క్షేత్రస్థాయిలో తమపై ప్రజలకు నమ్మకం కలగడం లేదని తెలిపారు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన బీజేపీకి సహకరించకపోవడంతో ఇలాంటి కామెంట్స్ వచ్చాయి. కానీ బీజేపీ మాత్రం జనసేన పొత్తును వదులుకోవడం లేదు – BJP :