pawan kalyan:ఒక్కడిని ఇంతమంది నేతలు టార్గెట్ చేసి దాడులపై దాడులు చేస్తున్నారంటనే ఒక విషయం అర్ధమైపోతోంది. రాబోయే ఎన్నికల్లో తమకు సదరు నేత ఎంతగా కొరకరాని కొయ్యగా మారుతున్నారని అనుకుంటున్నారో. ఇంతకీ సదరు నేత ఎవరు ? దాడులు చేస్తున్నదెవరు ? అనే విషయంలో ఇప్పటికే క్లారిటి వచ్చేసుంటుంది. అవును మీరు అనుకుంటున్నది కరెక్టే. టార్టెట్ చేసింది మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాద్, దాడిశెట్టి రాజా. దాడికి గురవుతున్నది జనసేన అధినేత పవన్ కల్యాణ్.
మొన్నటి మంత్రివర్గ పునర్ వ్యవస్ధీకరణ తర్వాత పవన్ పై వైసీపీ నుండి మాటల దాడి బాగా పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న నరసరావుపేట, కర్నూలు, ఒంగోలు బహిరంగసభల్లో చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియాతో పాటు దత్తపుత్రుడంటు పవన్ను కూడా జత కలుపుతున్న విషయం తెలిసిందే. జగన్ దాడి మొదలుపెట్టగానే గుడివాడ, దాడిశెట్టి, అంబటి తమదైన స్టైల్లో ఆరోపణలు, విమర్శల తీవ్రతను పెంచేస్తున్నారు.
పనిలో పనిగా పవన్ వ్యక్తిగత జీవితాన్ని కూడా గుడివా టచ్ చేస్తున్నారు. అయితే పవన్ వ్యక్తిగత జీవితంపై ఆరోపణలు ఈనాటివికావు కాబట్టి వాటికి పెద్దగా విలువఇవ్వాల్సిన అవసరంలేదు. ఇంతమంది పవన్ను టార్గెట్ చేస్తున్నారంటేనే వచ్చే ఎన్నికల్లో జనసేన తమను ఎక్కడ ఇబ్బంది పెడుతుందో అనే టెన్షన్ మొదలైనట్లే కనబడుతోంది. 2019 ఎన్నికలకు ముందు పవన్ వ్యూహాలు లేకుండానే ఎన్నికలకు వెళ్ళారు. అందుకనే బోర్లాపడ్డారు.
కానీ 2024 ఎన్నికల విషయంలో మాత్రం కాస్త వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే వివిధ ప్రాంతాల్లో వివిధ సమస్యలను తీసుకుని జనాల్లోకి చొచ్చుకుని వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతుల కుటుంబాలను పరామర్శించటం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల తరపున జనసేన నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు.
అలాగే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై పవన్ ఇప్పటికి రెండుసార్లు బహిరంగసభలు నిర్వహించారు. కాకపోతే స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తున్న నరేంద్రమోడిని కాకుండా సంబంధంలేని జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. ఈ విషయాన్ని పవన్ ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో జనసేనకు బాగా ఊపు వస్తోందనే ప్రచారం అందరికీ తెలిసిందే.
పవన్ వైఖరి చూస్తే ఎక్కువగా గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు అనుమానంగా ఉంది. తాను జనాల్లోకి మరింత విస్తృతంగా వెళ్ళటమే కాకుండా నేతలు, కార్యకర్తలను కూడా వెళ్ళేట్లుగా పవన్ చేయగలిగితే జనాదరణ అదే పెరుగుతుంది. రాజకీయ పార్టీ అన్నాక నిరంతరం ప్రజల్లో ఉన్నపుడే, ప్రజల తరపున పోరాటాలు చేసినపుడే ఆధరణ పెరుగుతుంది. షెడ్యూల్ ఎన్నికలకు ఇక ఉన్నది కేవలం రెండేళ్ళు మాత్రమే. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకునే పవన్ తన షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి.