విదేశీ పెట్టుబడులలో 14వ స్థానంతో ఏపీ వెనుకంజ.. తెలంగాణ ర్యాంక్ 7!

భారత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) 2019, అక్టోబర్ నుంచి 2022, డిసెంబర్ వరకు విదేశీ పెట్టుబడుల (FDI) ఈక్విటీ ఇన్‌ఫ్లోలను రాష్ట్రాల వారీ వివరాలను విడుదల చేసింది. ఈ రాష్ట్రాల జాబితాలో మొత్తం 5,751 కోట్ల FDIలతో ఆంధ్రప్రదేశ్ పద్నాలుగో స్థానంలో ఉంది. ఆ కాలంలో దేశం అందుకున్న మొత్తం పెట్టుబడులలో ఇది 0.42% మాత్రమే కావడం గమనార్హం.

ఇక, పొరుగు రాష్ట్రమైన తెలంగాణ 33,940 కోట్ల ఎఫ్‌డీఐలతో ఏడో స్థానంలో ఉంది, ఇది దేశంలోని మొత్తం ఎఫ్‌డీఐలలో 2.52%. అత్యధిక ఎఫ్‌డీఐలు ఉన్న మొదటి ఐదు రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు. కాగా ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రాలు, అభివృద్ధి చెందని ఈశాన్య రాష్ట్రాలతో పోటీ పడుతోంది.

గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఆంధ్రప్రదేశ్‌ ఆరు స్థానాల్లోపు ఉండేది. ఆయన కాలంలో వచ్చిన అనంతపురంలోని కియా మోటార్స్ ఇప్పటి వరకు భారతదేశం అందుకున్న అతిపెద్ద ఎఫ్‌డీఐ. అయితే ప్రస్తుత ప్రభుత్వం పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత కనిపించడం లేదని, ఉచితాలను అందించడంపైనే పూర్తి దృష్టి సారిస్తోందని స్పష్టం అవుతుంది.