Nandamuri Family : హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరు తీసేస్తే బయటజనాల సంగతేమో కానీ నందమూరి కుటుంబం నుండే మిశ్రమ స్పందన రావటం ఆశ్చర్యంగా ఉంది. ఎన్టీయార్ కు కొడుకులు, కూతుళ్ళు చాలామందే ఉన్నారు. అలాగే అల్లుళ్ళు, కోడళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు కూడా చాలామందే ఉన్నారు. అయితే సంతానం, వారసులు ఎంతమందున్నా కొందరికి మాత్రమే జనాల్లో గుర్తింపుంది. ఇలాంటి వాళ్ళల్లో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీయార్, కల్యాణ్ రామ్, దగ్గుబాటి పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబునాయుడు, లోకేష్ ముఖ్యులు.
తాజా వివాదమైన పేరుమార్పు విషయంలో చంద్రబాబు, లోకేష్, పురందేశ్వరి ఎన్టీయార్ పేరు తీసేసి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో రామకృష్ణ పేరుతో నందమూరి వారసులంటు ఒక ఖండన రిలీజ్ అయ్యింది. అయితే బాలకృష్ణ మాత్రం గట్టిగా స్పందిచినట్లు లేరు. ఇదే సమయంలో జూనియర్ చేసిన ట్వీట్ చాలామందికి అర్ధమేకాదు. కర్రవిరగకుండా పాము చావకుండా అన్నట్లుగా ఉందా ట్వీట్. ఆ ట్వీట్ చూసిన తర్వాత ఏదో ఇవ్వాలి కాబట్టి తప్పనిస్ధితిలో ట్వీట్ చేసినట్లుంది.
కల్యాణ్ రామ్ మాత్రం తాత ఎన్టీయార్ పేరు తీసేయటం తనకు బాధ కలిగించిందని డైరెక్టుగానే ఎలాంటి సుత్తిలేకుండా చెప్పేశారు. మరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎందుకని నోరు మెదపలేదో అర్ధం కావటంలేదు. ఏదేమైనా ఎన్టీయార్ పేరు తీసేసిన విషయంలో నందమూరి కుటుంబం నుండి అభిమానులు ఊహించిన స్ధాయిలో రియాక్షన్ అయితే లేదన్నది వాస్తవం.
వచ్చిన రియాక్షన్ కూడా మిశ్రమ స్పందనగా మాత్రమే ఉంది. ఈ స్పందనే అభిమానులతో పాటు పార్టీ నేతలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజానికి యూనివర్సిటీకి పేరు మార్చటం వల్ల వైసీపీకి వచ్చే నష్టం టీడీపీ రాబోయే లాభం ఏమిటనేది ఇక్కడ అప్రస్తుతం. కాకపోతే తమ అభిమాన నటుడు, నాయకుడి పేరును యూనివర్పిటికీ తీసేయటం పట్ల అభిమాన సంఘాలు కూడా పెద్దగా స్పందించకపోవటమే విచిత్రంగా ఉంది. మరి తాజా వివాదం ప్రభావం వైసీపీపై ఏమాత్రం ఉంటుందనేది ఆసక్తిగా మారింది.