Police: పోలీస్ వేషంలో ప్రజలను మోసం చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం మునిగడపకు చెందిన గుర్రం నరేష్ అనే యువకుడు పోలీసు డ్రెస్ తో తీసుకున్న ఫోటోలను డీపీగా పెట్టుకొని.. అమ్మాయిలను పరిచయం చేసుకోవడం.. ఆ తర్వాత వారికి ఫోన్ చేసి మాట్లాడిన సంభాషణలు రికార్డ్ చేసి.. వారిని బెదిరిస్తూ లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు.. విషయం తెలుసుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు..
ఈనెల 18న సాయంత్రం 5 గంటల సమయంలో ఎస్ఐ కృష్ణమూర్తి, ఏఎస్ఐ వెంకట రమణారెడ్డి, సిబ్బందితో కలిసి జగదేవపూర్ గ్రామ శివారులోని కెనాల్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో అటుగా బైక్ పై వచ్చిన యువకుడిని పోలీసులు ఆపారు. అతని వద్ద ఉన్న బ్యాగును చెక్ చేయగా.. అతని వద్ద పోలీస్ యూనిఫామ్ వేసుకున్న ఫోటోలు, ఒక బొమ్మ తుపాకి, ఒక ఎయిర్ గన్, రెండు సెల్ ఫోన్లు, డెల్ కంపెనీ లాప్టాప్, ఒక కింగ్స్టన్ పెన్ డ్రైవ్, ఒక హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు.
వాటిని చూసి అనుమానం అతనిని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. నేను పోలీస్ యూనిఫాంలో వేసుకుని దిగిన ఫోటోలు స్నేహితులకు, ఇతరులకు చూపిస్తూ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఎస్సైగా పని చేస్తున్నానని చెప్పుకుంటూ తిరుగుతున్నాను. అదే విధంగా ఆన్లైన్ యాప్ నందు పోలీస్ యూనిఫాంలో ఉన్న ఫోటోలు డీపీగా పెట్టుకుని అమ్మాయిలతో, ఇతరులతో న్యూడ్ ఫోన్ కాల్స్ మాట్లాడుతాను. అలా మాట్లాడిన కాల్స్ రికార్డు చేసి నేను హార్డ్ డిస్క్ లో సేవ్ చేసుకున్నానని, పలు విధాలుగా వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ మోసం చేస్తున్నానని ఒప్పుకున్నాడు.
ఈ సందర్భంగా గజ్వేల్ ఏసిపి ఎం. రమేష్ మాట్లాడుతూ.. పోలీసులమని చెప్పి, పోలీస్ వేషంతో ఫోటోలు దిగి పోలీస్ ఇన్ఫార్లమని చెప్పుకుంటూ ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వెంటనే డయల్ 100 , సంబంధిత పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వాలని సూచించారు. పై నిందితునితో ఇబ్బందిపడిన మహిళలు, ప్రజలు ఎవరైనా ఉంటే నిర్భయంగా పోలీస్ స్టేషన్ కు, సిద్దిపేట షీ టీమ్- 7901640473, స్నేహిత మహిళా సపోర్ట్ సెంటర్-9494639498, గజ్వేల్ ఎసిపి-8333998684 నెంబర్లకు సమాచారం అందించాలని. సమాచారం అందించిన వారి పేర్లు అత్యంత గోప్యంగా ఉంచబడుతుందని Acp తెలిపారు.