Warangal: వరంగల్ 15 డివిజన్ లో వనిత అనే మహిళ ఇంటి వద్ద ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గొర్రెకుంట పశుసంవర్ధక శాఖ బొల్లిగుంట పశువుల ఆసుపత్రిలో వెటర్నరీ అసిస్టెంట్ గా పనిచేస్తున్న వనిత వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అయితే భర్త చనిపోయిన ఆరు నెలలకే వనిత చనిపోయింది.

వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో వర్క్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న ప్రభాకర్, వనిత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు కూడా ఉన్నారు. కాగా గత ఆరు నెలల క్రితం ప్రభాకర్ అనారోగ్యంతో మృతి చెందాడు. భర్తకు దూరమైన వనిత కొంతకాలంగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఆమె కి తన ప్రియుడికి కొద్దిరోజులుగా ఏవో మనస్పర్ధల కారణంగా గొడవలు వచ్చాయని.. ఈ కారణంగా ప్రియుడు ఆమెకు ఫోన్ చేయడం లేదని మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అందుకు కారణం వినీత సెల్ ఫోన్ లో ఐ మిస్ యు అనే మెసేజ్ ఉండటంతో అదే కారణమని భావిస్తున్నారు. ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. గీసుకొండ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికే తండ్రి మరణించగా.. ఇప్పుడు తల్లి కూడా ఇలా మరణించడంతో ఆ ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.