Undavalli Arun Kumar : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చోటు చేసుకుని ఎనిమిదిన్నర సంవత్సరాలు అయింది. అయితే రోజులు గడిచిపోతున్నాయే కానీ ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన మెజారిటీ అంశాలు పరిష్కారానికి నోచుకోవట్లేదు. ఎక్కడి ఆస్తులు అక్కడే ఉన్నాయి. వాటి విలువ సుమారు లక్షన్నర కోట్ల రూపాయలు. ఈ విభజన సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా ఆసక్తి చూపట్లేదనేది స్పష్టమౌతోంది. ఈ విషయం తేల్చుకోవడానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో పిటీషన్‌ను దాఖలు చేసింది. పేరెన్స్ పేట్రియా కింద ఏపీ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ మహ్మఫూజ్ ఏ నాజ్కీ ఈ పిటీషన్ వేసారు.. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా ఆస్తుల పంపకాలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అభ్యర్థించారు.
1,42,601 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తుల విభజన పూర్తి కావట్లేదని, ఉమ్మడి రాష్ట్రంలో మెజారిటీ ఆస్తులు హైదరాబాద్‌లోనే ఉన్నాయని ఏపీ ప్రభుత్వం తన పిటీషన్‌లో స్పష్టం చేసింది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిందని, సంవత్సరాలు గడుస్తోన్నప్పటికీ.. ఆస్తుల విభజన మాత్రం పూర్తి కావట్లేదని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 కింద రాష్ట్రానికి, ప్రజలకు ఉన్న హక్కులను పరిరక్షించుకోవడానికి పిటీషన్ దాఖలు చేశామని తెలిపారు. తమ వాటాగా దక్కాల్సిన మెజారిటీ ఆస్తులన్నీ హైదరాబాద్‌లో ఉండిపోవడం, సకాలంలో పంపకాలు పూర్తికాకపోవడం వల్ల తాము నష్టపోవాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన పిటీషన్‌లో స్పష్టంగా పేర్కొంది.
పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9లో ఉన్న 91 ఇన్‌స్టిట్యూషన్స్, షెడ్యూల్ 10 కింద చేర్చిన 142 ఇతర సంస్థల్లో ఎక్కువ భాగం హైదరాబాద్ లోనే ఉన్నాయని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. ఈ పిటీషన్ పై విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ 11వ తేదీకి వాయిదా వేసింది. ఏపీ విభజనకు సంబంధించి నమోదైన పలు పిటిషన్లను విచారిస్తామని తెలిపింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ పార్దీవాలా సారథ్యంలోని ధర్మాసనం సమక్షానికి ఈ పిటీషన్లు వెళ్లనున్నాయి. కాంగ్రెస్ కు చెందిన లోక్ సభ మాజీ సభ్యడు ఉండవల్లి అరుణ్ కుమార్, తెలంగాణ వికాస్ కేంద్ర ప్రతినిధులు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిల అంశాన్ని కూడా ప్రభుత్వం ఇందులో స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ ను దాఖలు చేయడాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ స్వాగతించారు. హర్షం వ్యక్తం చేశారు. విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొంటోన్న సమస్యలను పరిష్కరించడంలో ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకుందని తెలిపారు.