నేడు మఠారీ, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. మరాఠీ, బాలీవుడ్ చిత్రసీమలో ఎంతో ప్రజాదరణ కలిగిన ప్రముఖ నటుడు జయంత్ సావర్కర్ తాజాగా కన్నుమూశారు. ఆయన మరణ వార్తను సినీలోకం తట్టుకోలేక పోతోంది. మరాఠీ సినిమా, సీరియల్ ప్రపంచంలో పూరించలేని శూన్యాన్ని మిగిల్చి వెళ్లిపోయారంటూ సినిమా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా నివాళి అర్పిస్తున్నారు. జయంత్ సావర్కర్ మరాఠితో పాటు హిందీలో కూడా వందల సినిమాలు, సీరియల్స్ ల్లో నటించి మెప్పించారు. హిందీలో అజయ్ దేవగన్ నటించిన ‘సింగం’ చిత్రంలో జయంత్ సావర్కర్ ఓ కీలక పాత్రలో కనిపించిన విషయం అందరికీ తెలిసినదే.
జయంత్ సావర్కర్ ప్రస్తుతం వయస్సు పైబడటంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. గతకొద్దికాలంగా ఆయన ఎటువంటి సినిమాలు, సీరియల్లోగాని నటించలేదు. ఇక ఇటీవల సావర్కర్ అనారోగ్యానికి గురికావడంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. తాజాగా పరిస్థితి విషమించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. థియేటర్ ఆర్టిస్టుగా కేరీర్ ప్రారంభించిన జయంత్ సావర్కర్ మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. సావర్కర్ 3 మే 1936న జన్మించారు. ఎన్నో మరాఠీ హిందీ థియేటర్, టెలివిజన్, చలనచిత్రాలలో పనిచేశారు. ఆయన నటనకు గానూ 21 మే 2023న అంబరనాథ్ మరాఠీ ఫిల్మ్ ఫెస్టివల్ వారు అతనికి ‘జీవన్ గౌరవ్’ అవార్డు ప్రదానం చేశారు.
అంతేకాకుండా నాటకరంగంలో మహారాష్ట్ర ప్రభుత్వం ద్వారా ‘నటర్య ప్రభాకర్ పన్షికర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్’ అవార్డును కూడా అందుకున్నారు. ‘సింగం’తో పాటు వాస్తవ్, యుగ్ పురుష్, బకాల్, 66 సదాశివ్, గద్బగ్ గోంధాల్, హరిఓం వంటి అనేక సినిమాలు ఆయనకు మంచి పేరును తీసుకొచ్చాయి. కాగా ఆయన మరణ విషయాన్ని ఆయన కుమారుడు కౌస్తుభ్ సావర్కర్ మొదటగా మీడియా ముందుకు వచ్చి తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈరోజు అనగా మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు. జయంత్ మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు అనేకమంది సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.
దాదాపు 6 దశాబ్దాలపాటు పైగా ఆయన టెలివిజన్ రంగంలో నటుడిగా కొనసాగారు. మొదట మరాఠీ బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన దినదినాభివృద్ధి చెందుతూ ఈ స్థాయికి వచ్చారు. నాటక రచయిత విజయ్ టెండూల్కర్ తెరకెక్కించిన ‘మణుస్ నవాచే బెట్’లో ఆయనకి మొదట అవకాశం వచ్చింది. ఆ తరువాత ‘హరి ఓం విఠల’, ‘66 సదాశివ్’, ‘గద్బద్ గోంధాల్’, ‘బకాల్’, ‘వాస్తవ్’, ‘యుగ్ పురుష్’, ‘సింగం’ వంటి సినిమాలలో కీలక పాత్రలు పోషించారు. ఇక తండ్రి మరణంపై కౌస్తుభ్ సావర్కర్ మాట్లాడుతూ… “10-15 రోజుల క్రితం బీపీకి గురి కావడంతో థానేలో ఆసుపత్రిలో చేర్చాం. గత రాత్రి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆ తర్వాత వెంటిలేటర్‌పై చికిత్స అందించడం జరిగింది. పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం 11 గంటలకు మరణించారు” అని చెప్పుకొచ్చారు.