ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుప్పం నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగుదేశం పార్టీ కంచుకోటగా కుప్పం నియోజకవర్గానికి మంచి పేరు ఉంది. దాదాపు కొన్ని సంవత్సరాల నుండి చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందుతూ ఉన్నారు. దీంతో ఎప్పుడూ ఎలాంటి ఎన్నికలు వచ్చినా కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరేస్తూ ఉంటది.
అయితే 2019 ఎన్నికలలో వైసీపీ గెలిచిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ ఘోరంగా ఓటమి చెందింది. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో వైసీపీ అత్యధిక స్థానాలు గెలవడం అప్పట్లో ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఇదిలా ఉంటే శనివారం రాష్ట్రంలో పలుచోట్ల పంచాయతీ ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉప ఎన్నికలలో కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అత్యధిక స్థానాలు గెలవడం జరిగింది.
సరిగ్గా ఎన్నికలు రాబోతున్న సమయంలో కుప్పం నియోజకవర్గంలో… తెలుగుదేశం పార్టీ పుంజుకోవటంతో టీడీపీ క్యాడర్ గెలుపు సంబరాలు చేసుకోవడం జరిగింది. జనం భారీ ఎత్తున పసుపు జెండాలతో రోడ్లపైకి వచ్చి బాణాసంచా కాల్చుకుని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పంచాయితీ ఉప ఎన్నికలలో చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు విజయకేతనం ఎగరవేయడంతో చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. ఇదే సమయంలో ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.