Manchu Manoj : వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుండి మంచుమనోజ్ పోటీచేయబోతున్నారా ? ఇపుడిదే విషయంపై మంచు అభిమానుల్లోను, టీడీపీ వర్గాల్లోను చర్చ జరుగుతోంది. ఈ మధ్యనే చంద్రబాబునాయుడు-మోహన్ బాబు మధ్య దాదాపు గంటకుపైగా భేటీ జరిగిన విషయం తెలిసిందే. ఏదో వినాయక గుడి నిర్మాణం విషయంలో మాట్లాడుకున్నట్లు మోహన్ బాబు చెప్పినా ఎవరు నమ్మలేదు. ఎందుకంటే వైసీపీతో మంచు ఫ్యామిలీకి కనెక్షన్ దాదాపు కట్టయినట్లే.
ఈ నేపధ్యంలోనే మళ్ళీ టీడీపీలో చేరాలని మంచు ఫ్యామిలి నిర్ణయించుకున్నదట. కారణం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో మంచు మనోజ్ టీడీపీ తరపున పోటీచేయాలని అనుకుంటున్నారట అదికూడా చంద్రగిరి నియోజకవర్గంలోనే పోటీచేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఎందుకంటే మంచు ఫ్యామిలీకి చెందిన శ్రీవిద్యా నికేతన్ విద్యాసంస్ధ రంగంపేటలోనే ఉంది. రంగంపేట మండలం చంద్రగిరి నియోజకవర్గంలోనే ఉంది.
తమకు నియోజకవర్గంలో బాగా పట్టుందని, కమ్మ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న కారణంగా గెలుపుకు ఢోకా ఉండదని మంచు ఫ్యామిలీ గట్టిగా నమ్ముతోంది. మనోజ్ కూడా ఆమధ్య మాట్లాడుతు తనకు రాజకీయాలంటే బాగా ఆసక్తుందని, వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తానని చెప్పారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నుండి పోటీచేసే ఉద్దేశ్యంతోనే టికెట్ కోసం చంద్రబాబును మోహన్ బాబు కలిశారనేది టాక్. ఓకే చంద్రబాబుకు ఇపుడున్న అవసరాల రీత్యా మనోజ్ కు చంద్రగిరిలో టికెట్ ఇస్తే ఇవ్వచ్చు. కానీ గెలుపు అవకాశాలు ఎంతన్నది గ్యారెంటీలేదు.
ఎందుకంటే వైసీపీ ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డికి మంచి పట్టుంది. పైగా ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలిచే సుమారు పాతికేళ్ళవుతోంది. ఇలాంటి నియోజకవర్గంలో గెలుస్తామని మనోజ్ ఎలాగ అనుకుంటున్నారో అర్ధం కావటంలేదు. ఈ నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ పూర్తిగా దెబ్బతినేసింది. మనోజ్ కు పార్టీ క్యాడర్ సహకరిస్తుందనే నమ్మకంకూడా లేదు. ఎప్పుడైతే నియోజకవర్గంలో పోటీచేయటానికి మనోజ్ ఆసక్తిగా ఉన్నారని, చంద్రబాబుతో భేటీ అయ్యారని తెలిసిందో వెంటనే నిరసనలు మొదలైపోయాయి. మనోజ్ కు ఎట్టి పరిస్ధితుల్లోను టికెట్ ఇద్దంటు ఇక్కడి నేతలు గట్టిగా చెబుతున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.