AP Power Cut : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 2 ధర్మల్ పవర్ ప్లాంట్ లో సాంకేతిక లోపాలు తలెత్తడం లో పవర్ జనరేషన్ కి అంతరాయం ఏర్పడింది. లోడ్ అడ్జస్ట్ మెంట్ చేయడం కోసం కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు విడతలవారీగా పవర్ కట్ చేశారు.. ప్రతి గ్రామానికి కనీసం 1 నుంచి 2 గంటల పాటు కోత విధించడంతో పరిశ్రమలు, వ్యవసాయ కనెక్షన్లకు ఆటంకం ఏర్పడింది..
కృష్ణపట్నం కు చెందిన ఏపీ జెన్ కో 800 మెగావాట్లు, విజయవాడ విటీపీఎస్ లో 500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్లలో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. ఇక ఇదే సమయంలో విశాఖలోని సింహాద్రి ధర్మల్ ప్లాంట్ నుంచి 400 మెగావాట్ల ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. దాంతో గ్రిడ్ కు 1700 మెగావాట్ల విద్యుత్ తగ్గింది. లోడ్ సర్దుబాటు కోసం గ్రామీణ ప్రాంతాల్లో రొటేషన్ విధానంలో కోతలు విధించారు.

తూర్పుగోదావరి, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం జిల్లాల లోని మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలలోని కొన్ని ప్రాంతాలలో రొటేషన్ పద్ధతిలో గంట నుంచి రెండు గంటల సమయం కోత విధించారు. సాంకేతిక సమస్యల కారణంగా గురువారం 8 వేల మెగా వాట్ల కొరత ఏర్పడిందని అందుకని ఐదు జిల్లాల పరిధిలో విద్యుత్ కోతలు విధించాల్సి వచ్చిందని ఈపిడిసిఎల్ సిఎండి సంతోష్ రావు తెలిపారు. అయితే తమ పరిధిలో ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తలేదని ఎన్టిపిసి వర్గాలు తెలియజేశారు.