అందంగా ఉందని బుట్టలో పట్టాడు.. క్యాష్ దోచుకొని చితక్కొట్టుడు కొట్టాక గానీ జ్ఞానోదయం కాలేదు..

గోదావరిఖని ఎన్టీపీసీకి చెందిన సుద్దాల రేవంత్ గత కొన్ని సంవత్సరాలుగా పెళ్లి చేసుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నాడు. నిజానికి రేవంత్‌కి ఆల్రెడీ పెళ్లయింది. ఆ తర్వాత విడాకులు అయ్యాయి. మళ్లీ పెళ్లి కోసం ప్రయత్నాలు చేశాడు కానీ కొద్ది నెలల దాకా ఏ అమ్మాయితో పెళ్లి కుదరలేదు. చివరగా షాదీ డాట్ కామ్‌లో ఒక అకౌంట్ ఓపెన్ చేశాడు. ఆ ప్లాట్‌ఫామ్‌లో ఓ మంచి అమ్మాయి కోసం వెతకడం ప్రారంభించాడు. అప్పుడే రేవంత్‌ ప్రొఫైల్ చూసి వరంగల్ జిల్లాకు చెందిన మెండే అనూష తన ఇంట్రెస్ట్ తెలియజేసింది.

రేవంత్ చెప్పిన ప్రకారం, అందంగా ఉన్న అనూష తన ప్రొఫైల్ లైక్ చేయడంతో అతను బాగా ఖుషి అయ్యాడు. వెంటనే ఆమెతో మాటలు కలిపాడు. బయట వారిద్దరూ కలుసుకొని ఒకరి ఇష్టాలను మరొకరు తెలుసుకున్నారు. ఇష్టాలు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారు పెద్దల సమక్షంలో ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. రెండో పెళ్లి అయినా సరే తనకు ఎంతో అందమైన, అర్థం చేసుకునే భార్య దొరికిందని రేవంత్ సంతోషించాడు. రెండు నెలలపాటు ప్రపంచమే మరిచిపోయి వారిద్దరూ కాపురం చేశారు.

ఆ తర్వాత అనూష నిజస్వరూపం బయటపడింది. ఆమె రెండు నెలల తర్వాత తనకు సిగరెట్లు కావాలని, మందు తెచ్చి ఇవ్వాలని రేవంత్ తో గొడవ పడటం స్టార్ట్ చేసింది. చూసేందుకు చాలా అందంగా ట్రెడిషనల్ గా ఉన్నా అనూష అలా మాట్లాడుతుంటే రేవంత్ కి ఏమీ అర్థం కాకా మొదట షాక్ అయ్యాడు. తర్వాత అనూషకు మందు, సిగరెట్ అలవాటు ఉందని తెలుసుకొని గుండె పగిలాడు. ఆమె రోజూ గొడవ చేస్తుంటే తన పెళ్లి లైఫ్ తలకిందులు అయినట్లు అనిపించింది. అనూష చేతిలో తను దారుణంగా మోసపోయానని అతడు మానసికంగా కూడా కృంగిపోయాడు.

చివరికి మందు సిగరెట్ మానేయాలని ఆమెతో గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. కానీ అనూష చాలా ముదురు కావడంతో రేవంత్ కి చుక్కలు చూపించింది. ఒక రోజు తాను తన అక్క ఇంటికి వెళ్తున్నానని చెప్పి రేవంత్ ఇంటి నుంచి వెళ్లిపోయింది. దాంతో పీడా పోయిందనుకొని రేవంత్ ఇంట్లో కి వెళ్ళాడు. అనంతరం బీరువా చెక్ చేసుకోగా అందులో నాలుగు తులాల బంగారం, రూ.70 వేల నగదు కనిపించకుండా పోయింది. దాంతో ఖంగుతిన్న రేవంత్ వెంటనే అనూషను ఫోన్ ద్వారా కాంటాక్ట్ కావడానికి ప్రయత్నించాడు కానీ ఫలితం లేకుండా పోయింది.

ఒక వారం క్రితం ఆమె ఫోన్ చేసి అతడిని హైదరాబాద్ కి పిలిపించిందట. తర్వాత ఒక రూమ్ కి రప్పించిందని, తన ఫ్రెండ్స్ తో కలిసి తనని చిత్రహింసలు పెట్టిందని రేవంత్ ఆరోపించాడు. రూ.10 లక్షలు ఇవ్వాలని, లేదంటే అతని ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానని కూడా తన ఫ్రెండ్స్ తో కలిసి బెదిరించిందట. దాంతో రేవంత్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే అనూష ఒక ఛానల్ తో ఫోన్ ద్వారా మాట్లాడుతూ రేవంత్తే తనని మోసం చేశాడని ఆరోపించింది. కాగా పోలీసులు వీరిద్దరిలో ఎవరిది తప్పు అనేది తేల్చేందుకు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు.