Minor Girl: ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ గురుకుల హాస్టల్‌లో ఉంటూ తొమ్మిదవ తరగతి చదువుతున్న మైనర్ బాలిక ఓ పసి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్త జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లాలోని వాల్మీకి పురంలోని జీఎంసీ బాలయోగి గురుకుల పాఠశాలలో మైనర్ బాలిక ప్రసవంపై డీసీఓ వెంకట్రావు వివరణ ఇచ్చారు.
ఏపీలోని అన్నమయ్య జిల్లాలో తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న మైనర్ బాలిక ప్రసవించింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం వరదయ్యపాలెంకు చెందిన 14ఏళ్ల బాలిక వాల్మీకి పురంలోని జీఎంసీ బాలయోగి గురుకుల పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతోంది. హాస్టల్‌లో కడుపు నొప్పి వస్తోందని చెప్పడంతో బాలికను వాల్మీకిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
హాస్పిటల్ లోని వైద్యులు మైనర్ బాలిక గర్భవతిగా గుర్తించారు. అక్కడే మగబిడ్డ కు జన్మనిచ్చింది.. ఆ బిడ్డను స్వాదినం చేసుకొన్న ఐసిడిసి అధికారులు విద్యార్దిని తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ఇంత జరుగుతున్న హాస్టల్ సిబ్బంది, అధికారులు, తల్లిదండ్రులకు తెలియకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.
ఈఘటనపై జిల్లా కలెక్టర్ హాస్టల్ సిబ్బంది, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం ను పోలీసులకు ఫిర్యాదు చేసి తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించామని డీసీఓ పేర్కొన్నారు. బాలికకు మెరుగైన వైద్యం అందించేందుకు తిరుపతి ఆసుపత్రికి తరలించారు. అయితే మైనర్‌ను గర్భవతిని చేసింది ఎవరూ అనే విషయంపై ఆరా తీస్తున్నారు అధికారులు.