సూపర్ స్టార్ కృష్ణ గతేడాది నవంబర్ 15న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ బుర్రిపాలెం బుల్లోడు చనిపోవడంతో తెలుగు ఇండస్ట్రీ అంతా శోకసంద్రంలో మునిగింది. ముఖ్యంగా మహేష్ బాబు ఈ వార్తను తట్టుకోలేకపోయాడు. నమ్రతా శిరోద్కర్ కూడా కన్నీరు మున్నీరయింది. చిన్న కోడలైన నమ్రతను కృష్ణ ఒక కోడలుగా కంటే కూతురిగానే చూసుకునేవారు. అందుకే మహేష్ బాబు సతీమణి నమ్రతకి కృష్ణ అంటే ఎనలేని అభిమానం. ఆ ప్రేమ, అభిమానంతోనే కృష్ణ జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు కట్టించాలని ఆమె మే 31న నిర్ణయించింది.
హీరో కృష్ణ జయంతి సందర్భంగా ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. నమ్రత పేదలకు ఇళ్లు కట్టించడానికి రూ. 10 కోట్లు ఖర్చు చేస్తోందని సమాచారం. ఈ డబ్బులతో ఆమె దాదాపు 400 పేద కుటుంబాలు జీవించేలా ఇళ్లు నిర్మిస్తోందని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి అభిమానులకు ఖుషి అవుతున్నారు. ఒకవైపు మహేష్ చిన్న పిల్లలకు ఉచితంగా వైద్యం అందిస్తూ వారిని కాపాడుతుంటే… మరోవైపు నమ్రత ఇళ్లు లేక ఇబ్బంది పడుతున్న పేదలకు ఇళ్లను కట్టిస్తున్నారని పొగడ్తలు కురిపిస్తున్నారు.
కృష్ణపై ప్రేమతో పాటు పేదల పట్ల ఆమె చూపించిన కరుణను ప్రశంసిస్తున్నారు. ఆమె భర్త మహేష్ బాబు కూడా ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాదు, ఆమె తలపెట్టిన ఈ మహోత్తర కార్యక్రమంలో మహేష్ నమ్రతకు చాలా సపోర్ట్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కృష్ణ పట్ల కోడలు చూపిస్తున్న గౌరవం తెలిసి అభిమానులు ఆమెను మరింత పొగిడేస్తున్నారు. నమ్రత గతంలో కూడా చాలా చారిటీలు చేసే తన గొప్ప హృదయాన్ని చాటుకుంది. ఈ ముద్దుగుమ్మ ఫ్యామిలీ కోసం ఎక్కువ టైమ్ కేటాయిస్తుంటుంది. అలాగే ఫిట్నెస్ పై దృష్టి పెడుతూ ఇప్పటికీ పాతికేళ్ల యువతిలా కనిపిస్తుంది.