ప్రముఖ తెలంగాణ వాగ్గేయకారుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణాన్ని తెలుగు ప్రజానీకం జీర్ణించుకోలేకపోతోంది. అభిమానుల ఆర్తనాదాలకైతే లెక్కేలేదు. కన్నీటి పర్యంతమౌతూ విలపించిన ఘటనలు మనం చూసాము. గద్దర్ ఇక లేరనే విషయం తెలిసి యావత్తు తెలంగాణవాదులు నివాళి అర్పించారు. పార్టీలతో సంబంధం లేకుండా, ప్రాంతాలకతీతంగా ఆయన పార్థివ దేహాన్ని కొన్ని లక్షలాదిమంది సందర్శించారు. అశేష జనసంద్రం నడుమ ఆశ్రు నయనాలతో అంతిమయాత్ర ఓ జనసంద్రాన్ని తలపించింది. ఆయన మరణించారని తెలియగానే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రభుత్వ యంత్రాంగమే అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడం విశేషం.
మొన్న అనగా ఆదివారంనాడు అపోలో ఆసుపత్రి నుండి పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఎల్బీ స్టేడియంకు తరలించగా, సోమవారం అక్కడి నుంచి అంతిమయాత్రగా అల్వాల్‌లోని మహాబోధి విద్యాలయానికి తరలించడం జరిగింది. అల్వాల్‌లోని గద్దర్ ఇంటికి పార్థివదేహం చేరుకోగా, భారీ సంఖ్యలో చేరుకున్న ఆయన అభిమానులు, కళాకారులు కుటుంబసభ్యులను ఓదారుస్తూ… జోహార్ గద్దరన్న అంటూ నివాళి అర్పించారు. ఇక అక్కడికి తెలుగు సినిమా ప్రముఖులతో పాటు తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యేలతో కలిసి గద్దర్ ఇంటికి చేరుకొని నివాళి అర్పించి, కొడుకు సూర్యం, సతీమణి, కుటుంబసభ్యులకు ధైర్యం చెప్తూ ఓదార్చారు.
ఆ తరువాత పార్థివదేహాన్ని మహాబోధి విద్యాలయానికి తీసుకెళ్లడం జరిగింది. ఈ క్రమంలో గద్దర్ పార్ధివదేహాన్ని మోసేందుకు అభిమానులు పెట్ట్టారు. ఇందులో ప్రముఖ సినిమా నటుడు మహేష్ బాబు కూడా ఉన్నట్టు సమాచారం. అభిమాన గాయకుడు గద్దర్ మరణాన్ని తట్టుకోలేకపోయిన మహేష్ తన పనులన్ని మానుకొని మహాబోధి విద్యాలయంలో బౌద్ధ సంప్రదాయాలతో గద్దర్ చివరి అంతిమ సంస్కారాలు పూర్తయ్యేవరకు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక పోలీసుల గౌరవ వందనం తర్వాత రాత్రి 8.02 గంటలకు అంత్యక్రియలు పూర్తీ చేయడం జరిగింది.
ఎల్బీ స్టేడియం నుంచి సోమవారం ఉదయం 11 గంటల అనంతరం అంతిమయాత్ర ప్రారంభం కాగా, దాదాపు 6 గంటలపాటు మహాబోధి విద్యాలయం వరకు కొనసాగింది. అడుగడుగునా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతతో అంతిమయాత్రకు ఏర్పాట్లు చేయడం గమనార్హం. ఆయన పార్థివదేహాన్ని చూడగానే నాయకులు, ప్రజలు, అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబసభ్యులు, అభిమానులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో బౌద్ధ సంప్రదాయంలో గద్దర్ పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు చాలా ఘనంగా నిర్వహించారు. ఆ తరువాత ప్రభుత్వ లాంఛనాల ప్రకారం పోలీసులు గౌరవ వందనంగా గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు జరిపారు.