చదువుల తల్లిని చిదిమేసిన దుర్మార్గుడు… నడిరోడ్డుపైనే దారుణం జరిగిపోయింది!

కొన్నాళ్లక్రితం కాలేజ్ నుంచి ఇంటికి తిరిగివస్తున్న విద్యార్థినిపై అదే కాలేజ్‌లో పనిచేస్తున్న లైబ్రేరియన్ అతికిరాతకంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. అసోం‌లోని ధేమాజీ జిల్లాలో జరిగిన ఈ ఘటనకి రాష్ట్రం అట్టుడికిపోయింది. చదువులతల్లిని చిదిమేసిన దుర్మార్గుడుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు.

Advertisement

Advertisement

ఆ బంగారు తల్లిపేరు నందిత సైకియా. తండ్రి పెద్దగా చదువుకోలేదు. రైతు కుటుంబం. ఉత్తర అసోం ధేమాజీ జిల్లాలోని మోరిధార్ కాలేజ్‌లో నందిత డిగ్రీ కోర్సు చదువుతోంది. నందిత చదువులోనే కాకుండా క్రాఫ్ట్ వర్క్ చేయడంలో మంచి దిట్ట. దాంతో ఆమె చదువుతో పాటు క్రాఫ్ట్ వర్క్ లో కూడా బాగా రాణించింది. ఈ క్రమంలో రాష్ట్ర స్థాయిలో ఎన్నో బహుమతులు కూడా గెల్చుకుంది. ఓ వైపు చదువు, మరోవైపు కళ… రెండింటిని బాలన్స్ చేస్తూ ముందుకు పోయేది. ఏనాటికైనా తాను అనుకున్న రంగంలో స్థిరపడి కన్నవారికి ఆసరాగా నిలవాలని అనుకుంది. కానీ విధి వెక్కిరించింది. అందంగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఓ అగాధాన్ని సృష్టించింది.

ఆమె కుటుంబ పరిస్థితి అంతంతమాత్రం కావడంతో పుస్తకాలను కొనుక్కోలేని పరిస్థితి. దాంతో ఆమె చదువుతున్న కాలేజ్ లోనే వున్న లైబ్రరీకి వెళ్లి తనకి అవసరమైన పుస్తకాలను తెచ్చుకొని చదువుతుండేది. ఈ క్రమంలో లైబ్రేరియన్ రింటు శర్మ ఆమెపైన కన్నేశాడు. దాంతో ఆమె అడిగిన పుస్తకాలను అవసరానికి మించి సరఫరా చేసేవాడు. అదంతా అతని మంచితనం అనుకున్న అమాయకురాలు వాడి క్రూరమైన మనసుని గ్రహించలేకపోయింది. ఓ రోజు సందు చూసుకొని తనకు ఇస్తున్న పుస్తకాలంలో లవ్ లెటర్ రాసి పెట్టాడు. పుస్తకం తరిచి చూసిన నందితకి దిమ్మతిరిగింది.

దాంతో అతగాడిని సుతారంగా హెచ్చరించింది. తనకు అలాంటివంటే గిట్టవని, ఇష్టం లేదని చెప్పింది. అయినా అప్పటికే ఆమెపైన మొహం పెంచుకున్న రింటు శర్మ ఆమెని వెంటాడడం మొదలు పెట్టాడు. దాంతో ఇక లాభం లేదనుకొని ఈసారి కొంచెం గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఆ సమయంలో ఆమె స్నేహితురాలు కూడా ఆమె పక్కనే వుంది. ఇద్దరు తలా ఒకటి చెప్పి పంపించేశారు. దాంతో అవమానంగా భావించిన రింటు శర్మ సరియైన సమయంకోసం ఎదురు చూశాడు. ఈ క్రమంలో ఒకరోజు నందిత శనివారం కాలేజ్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో రింటు శర్మ కత్తితో అతి కిరాతకంగా ఆమెపైన దాడి చేసాడు.

ఆ సమయంలో పక్కనే వున్న ఆమె స్నేహితురాలు, తండ్రి కూడా గాయపడ్డారు. నందిత పరిస్థితి విషమంగా ఉండటంతో దిబ్రూగఢ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో నందిత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఈ ఘటనపై అప్పట్లో స్థానికులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. నందిత తండ్రి అయితే కోమాలోకి వెళ్ళిపోయాడు. నిందితుడికి మరణ శిక్ష విధించాలని కోరారు. నందిత మృతికి నిరసనగా అసోం వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, నాయకులు ఆందోళన చేపట్టారు. విషయం జరిగి సంవత్సరాలు గడుస్తున్నా ఆమె తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. నిందుతుడు రింటు శర్మ ప్రస్తుతం జైలుగోడల మధ్యన మగ్గిపోతున్నాడు.

Advertisement