టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు మేల్ సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే లేడీ సూపర్ స్టార్ విజయశాంతి అని చెప్పుకోవచ్చు. ఈ లేడీ సూపర్ స్టార్ తనదైన నటన, ఫైట్స్ తో తెలుగునాట మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్‌తో లేడీ అమితాబ్‌గా పేరు ప్రఖ్యాతలు గడించారు. ఇక విజయశాంతి పేరు చెబితే తెరపై ఆమె చేసిన పోరాటాలు మాత్రమే కాకుండా ఆమె చేసిన డాన్సులు కూడా గుర్తుకొస్తాయి. అటు ఫర్ఫామెన్స్ ఓరియంటెడ్ మూవీస్‌లో నటిస్తునే.. ఇటు గ్లామర్ డాల్‌గా తన సత్తా చాటింది విజయ శాంతి. కెరీర్ మొదట్లో ఎక్కువగా గ్లామర్ పాత్రలనే చేసిన విజయశాంతికి నటిగా మంచి గుర్తింపు ఇచ్చిన సినిమా మాత్రం ‘నేటి భారతం’ అని చెప్పుకోవచ్చు.
ఆ సినిమా తర్వాత నటిగా విజయశాంతి ఇక వెనుదిరిగి చూసుకోలేదు. అప్పటికే జయసుధ, జయప్రద, శ్రీదేవి, మాధవి తమ అభినయం, అందచందాలతో తెలుగుతెరను ఏలుతున్న రోజుల్లో విజయశాంతి ఎంట్రీ ఇచ్చి వారందరికీ సవాలుగా మారింది. 1964 జూన్ 24న వరంగల్‌లో జన్మించిన విజయశాంతి అసలు పేరు శాంతి. తెర పేరులోని విజయను తన పిన్ని విజయలలిత పేరు నుంచి తీసుకుందని చెబుతూ వుంటారు. విజయశాంతి తన 30 సంవత్సరాల సిని ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాలలో వివిధ పాత్రలలో సుమారు 190 సినిమాలకు పైగా నటించి మెప్పించినట్టు భోగట్టా.
విజయశాంతి చేసిన విజయవంతమైన సినిమాల లిస్ట్ చూస్తే అందులో అగ్నిపర్వతం, పసివాడి ప్రాణం, ప్రతిఘటన, మువ్వగోపాలుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, యముడికి మొగుడు, జానకిరాముడు, ముద్దుల మావయ్య, లారీ డ్రైవర్, కొండవీటి దొంగ, శత్రువు, గ్యాంగ్ లీడర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, మొండిమొగుడు పెంకి పెళ్ళాం, చినరాయుడు వంటి సినిమాలు ప్రేక్షకులకు స్ఫురణకు వస్తాయి. ఇక ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఒకటుంది. అదేమంటే ఈ లేడీ సూపర్ స్టార్ మనందరి సూపర్ స్టార్ అయినటువంటి మహేష్ బాబుకి బంధువన్న విషయం అతి కొద్ది మందికి తెలుసు. సూపర్ స్టార్ కృష్ణ విజయనిర్మల ను రెండో పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసినదే కదా. ఇక విజయశాంతి పిన్ని అయినటువంటి విజయలలిత ఎవరో కాదు… విజయనిర్మల ఆడపడుచు.
ఆ రకంగా విజయశాంతి స్వయంగా మహేష్ బాబుకు వరసకు వదిన అవుతుంది. విజయనిర్మల, విజయ లలిత, విజయశాంతి ఈ ముగ్గురు ఒకప్పుడు టాలీవుడ్ ను ఒక ఊపు ఊపినవారే. అయితే మహేష్ బాబుకు విజయశాంతి వదిన వరస అవుతుంది అని అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. అందుకే వీరిమధ్య స్నేహబంధంతో పాటు బంధుత్వం కూడా ఉంటుంది. ఆ చనువుతోనే ఆమె అప్పుడప్పుడూ మహేష్ ఇంటికి వెళుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె మహేష్ ఇంటికి వెళ్లి కూతురు సితారను చూసి మురిసిపోయిందట. అంతేకాకుండా సితార తాజాగా పేద విద్యార్థినిలకు సైకిళ్ళ పంపిణీ చేసిన విషయం తెలుసుకొని ఎల్లకాలం అలాగే ఉండాలని దీవించిందట