Breaking: ఈ కళ్యాణ మండపంలో రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు.. బుకింగ్స్ నేడే ప్రారంభం..

పెళ్లిళ్ల సీజన్‌లో కళ్యాణ మండపం బుక్ చేసుకోవడం అనేది తలకు మించిన భారంగా మారుతోంది. ముఖ్యంగా పెళ్లిల సీజన్లలో దాదాపు అన్ని కళ్యాణ మండపాలు బుక్ అయి ఉంటున్నాయి. ఒకవేళ ఏదైనా కళ్యాణ మండపం దొరికినా ఆ రేటు భరించలేక పెళ్లివారు నానా కష్టాలు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా బుక్ చేసుకోగల ఒక కళ్యాణ మండపాన్ని లలిత రైస్ ఇండస్ట్రీస్ అధినేతల్లో ఒకరైన మట్టె శ్రీనివాస్ అందుబాటులోకి తీసుకొచ్చారు.

శ్రీనివాస్ దాదాపు రూ.4 కోట్లతో సెంట్రల్ ఎయిర్ కండీషన్డ్ కళ్యాణ మండపాన్ని అన్నవరం దేవస్థానంలో ఏర్పాటు చేశారు. కళ్యాణ మండపం కోసం వేలాది రూపాయలు వెచ్చించలేని పేదవారికోసం ఈ కళ్యాణ వేదికను ఆయన ప్రారంభించారు. ఈ దేవస్థానంలోని కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకోవాలనుకునేవారు ఇప్పటినుంచే బుకింగ్ చేసుకోవచ్చు. ఈ మండపంలో ఒకేసారి 12 జంటలు పెళ్లి చేసుకునే వెసులుబాటు ఉంది. అంతేకాకుండా పెళ్లి వేడుకలు అత్యంత ముఖ్యమైన పాత్రలు, పాదుకలు, కుర్చీలు అన్నిటినీ అందుబాటులో ఉంచారు.

మామూలుగా కాకుండా కాస్త హుందాగా, ఉన్నతంగా పెళ్లి చేసుకోవాలనుకునే పేదవారికి ఈ కళ్యాణ మండపం ఒక బరం అని చెప్పవచ్చు. ఈ కళ్యాణ వేదికను మే 16న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. బుకింగ్స్ ఆదివారం అంటే ఈరోజు నుంచే ప్రారంభమయ్యాయి. పెళ్లి చేసుకునేవారు తమకు సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొస్తే అధికారులు ఒక తేదీని బుక్ చేస్తారు.

ఈ డాక్యుమెంట్స్‌లో లగ్న పత్రిక, వధూవరుల ఆధార్ జిరాక్స్, వారి తల్లిదండ్రుల ఆధార్ జిరాక్స్‌ ఉండాలి. ఈ పత్రాలను రత్నగిరిపై ఉన్న సీఆర్‌వో కార్యాలయంలో అందజేయాలి. ఈ మొత్తం ప్రక్రియలో రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు.