ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట అద్భుతంగా పాడి ఆస్కార్ అవార్డు గెలుచుకున్నాడు రాహుల్ సిప్లిగంజ్. ఈ అవార్డు గెలుచుకున్న తర్వాత రాహుల్ పై ప్రశంసల వర్షం కురిసింది. కాగా తాజాగా అతను రూ.10 లక్షల నజరానా కూడా గెలుచుకున్నాడు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ సింగర్‌కి జూన్ రెండవ తేదీన సన్మానం చేసి పది లక్షలు అందజేస్తామని ప్రకటించారు.
బోయిన్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆన్‌లైన్ క్విజ్ కాంపిటీషన్ ప్రారంభ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ప్లే బ్యాక్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి రాహుల్ పై ప్రశంసల వర్షం కురిపించారు. పేద కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ నేడు ఆస్కార్ గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచాడని, కానీ కేసీఆర్ ప్రభుత్వం అతనికి ఏం చేయకుండా నిరాశపరిచిందని చెప్పుకొచ్చారు.
కనీసం అతనికి సన్మానం కూడా చేయలేదని, ఈ నిజం తమను ఎంతో బాధిస్తుందని రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాహుల్ ని గుర్తించకపోయినా తమ పార్టీ గౌరవిస్తుందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా జూన్ 2న రాహుల్ సిప్లిగంజ్‌కి సన్మానం చేస్తామని, ఆ సందర్భంగా పదిలక్షలు కూడా అందజేస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందితే కోటి రూపాయలు క్యాష్ ఇస్తామని హామీ ఇచ్చారు.