ప్రతి ఇంటి పెరట్లో ఖచ్చితంగా ఉండాల్సిన మొక్కలలో ‘వాము’ ఒకటి. ఈ రోజుల్లో చాలామంది తమ ఇళ్లల్లో దానిని ఒక భాగం చేసుకున్నారు. అయితే ఆ మొక్కని ఎలా వాడుతున్నాం అనేదే అసలైన విషయం. సాధారకంగా చాలామంది దీనిని కేవలం నాన్ వెజ్ వంటకాలలో వాడడానికి మాత్రమే పెంచుతూ వుంటారు. కానీ, ఈ మొక్క వలన ఎన్నో ఉపయోగాలున్నాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
వాము మొక్క అనేది రుచికి, శుచికి, ఆరోగ్యానికి ఔషధం అని చెబుతారు మన పెద్దలు. కాలం రోజురోజుకీ మారిపోతున్న కారణంగా మన పూర్వికులు చెప్పిన మాటలను పెడచెవిన పెడుతున్నాం మనం. కానీ అది అంతమంచిది కాదు. అప్పటి జీవన విధానం అనేది అమృతతుల్యం. మీరు ఎక్కడ వున్నా, ఏం చేస్తున్న పెద్దలు చెప్పిన విధివిధానాలను ఆచరిస్తే ఈరోజు సంపూర్ణ ఆరోగ్యంగా జీవించగలము. ముఖ్యంగా మనం ఇలాంటి ఔషధ మొక్కల గురించి తప్పనిసరిగా వివరాలు తెలుసుకోవాలి. తద్వారా మనం మన రేపటి తరాలకి మంచి సమాచారాన్ని చేరవేసినవారం అవుతాము.
వాములో ఖనిజ లవణాలు, విటమిన్లు, పీచు, యాంటీ ఆక్సిడెంట్లు అనేవి పుష్కలంగా ఉంటాయి. దీన్ని పచ్చిగా, వేయించి కూడా కొందరు వాడుతారు. అదేవిధంగా నీటిలో కలుపుకొని తాగొచ్ఛు. ముఖ్యంగా తేనీటిలో వీటి ఆకులను వేసుకొని తాగితే జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి అని నిపుణులు చెబుతున్నారు. వాము మొక్కలను పెరట్లో లేదా తొట్టెల్లో పెంచుకుని తాజా ఆకులను వివిధ వంటకాల్లో వాడుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలు ఉన్నవారు ఈ వాము మొక్కలు పెంచుకోవడంతో ఎన్నో సమస్యల నుంచి బయటపడతారు.
వాము ఆకు వలన ఉపయోగాలు:
1. వాములోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాము గింజలను వంటకాలతో పాటు పలురకాల పానీయాలలో వాడుతారు.
2. వాము ఆకు అప్పుడప్పుడు వాడితే ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. వాము కొవ్వును కరిగించి, బరువు తగ్గడంలో సహకరిస్తుంది.
3. వెంట్రుకలు తెల్లబడకుండా చేసే శక్తి వాముకుంది. గుండెపోటుకు కారణమయ్యే కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తుంది. రక్తపోటును, అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
4. వాములో కాస్త ఆవనూనె వేసి ఇంట్లో ఒక మూలన ఉంచితే దోమలు దరిచేరవని నిపుణుల మాట.
5. చిన్న పిల్లలకు అజీర్తితో బాధపడినా, తద్వారా కడుపునొప్పి వచ్చినా వాము ఆకు మంచి ఔషధంలాగా పనిచేస్తుంది.
6. వాము ఆకు రసంలో తేనె కలిపి చిన్న పిల్లలకు ఇస్తే రోగ నిరోధక శక్తి చాలాబాగా పెరుగుతుంది.
7. చిన్న పిల్లలు తరచుగా దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్స్ వంటివి వాటితో ఇబ్బంది పడుతుంటే.. వాము ఆకు రసం ఇస్తే మంచి ఔషదంలాగా పనిచేస్తుంది.
8. అదేవిధంగా కాలిన గాయాలు, మచ్చలను వాము తగ్గిస్తుందని మీకు తెలుసా? దీనిలో యాంటీ సెప్టిక్ గుణాలు గాయాలను తగ్గించడానికి సహకరిస్తాయి.వాములో ఉండే యాంటీ బయోటిక్, అనస్తిటిక్ విలువల వల్ల కాళ్ల నొప్పులు తగ్గుతాయని ఆయుర్వేదం చెబుతుంది.
వాముని పెంచే విధానం:
మార్కెట్లో విత్తనాలు దొరుకుతాయి. కంపోస్టు, కొబ్బరి పీచు మిశ్రమాన్ని ట్రేలో గానీ, సిమెంట్ తొట్టెలో గానీ బాగా నింపిన పిదప అందులో పైపైన వాము గింజలు చల్లాలి. ఆ తర్వాత పైన పల్చగా మట్టిని కూడా పరచాలి. కాస్త నీడ ప్రదేశంలో ఉంచి ఉదయం, సాయంత్రం నీటిని తుంపరలుగా ఆ మట్టిపైన జల్లాలి. సరిగ్గా వారం నుంచి రెండు వారాల్లో ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. సూర్యరశ్మి వీటికి అంతగా అవసరం లేదు. కొద్దిగా ఎండపడే ప్రాంతం అయితే చాలు. ఆకులు ఎండిపోతే వేంటనే తుంచేయాలి. ఒకవేళ పురుగులు పడితే వేపనూనె పిచికారీ చేయాలి. తొట్టిలోని మట్టి తడారకుండా మాత్రం చూసుకోవాలి.