హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి విస్తరణ పనులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తాజాగా వెల్లడించారు. త్వరలోనే రెండువేల పడకల నిమ్స్ నూతన భవనానికి భూమిపూజ చేస్తామని వెల్లడించారు. దీనికి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా త్వరలో శంఖుస్థాపన జరుగుతుందని కూడా తెలిపారు.
2,000 పడకల సామర్థ్యం గల నిమ్స్ కొత్త సౌకర్యాన్ని ఎర్రమంజిల్ కాలనీలో 32 ఎకరాల్లో రూ.1571 కోట్లతో నిర్మించనున్నామని హరీష్ రావు చెప్పుకొచ్చారు. ఈ అత్యాధునిక మల్టీస్పెషాలిటీ బ్లాక్‌లో 500 ఎమర్జెన్సీ పడకలతో కలిపి 2000 పడకల ఉంటాయన్నారు. కొత్త బ్లాక్‌కు శంకుస్థాపన మే నెలలో జరిగే అవకాశం ఉంది.
అయితే సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసే సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు సత్వరం పూర్తి చేయాలని హరీష్ రావు కోరారు. నెలాఖరులోగా గాంధీ సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పూర్తి చేయాలన్నారు. కొత్త సౌకర్యం అందుబాటులోకి రావడం ద్వారా 5204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ చేస్తామని కూడా మంత్రి హరీశ్ రావు చెప్పారు.