Breaking: ఎంపీల సంఖ్య పెరగనుందని స్పష్టం చేసిన ప్రధాని మోదీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు అంటే మే 28న కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఛాంబర్‌లో ‘సెంగోల్’ అనే పవిత్ర వస్తువును ఏర్పాటు చేశారు. అంతేకాదు, భవిష్యత్తులో పార్లమెంట్‌లో సీట్లు, సభ్యుల (MPs) సంఖ్య పెరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. అందుకే కొత్త పార్లమెంట్‌ నిర్మాణం అవసరమని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు.

పాత పార్లమెంటు భవనం చాలా కాలం నాటిదని, అందులో అనేక ఇబ్బందులు ఎదురయ్యేవని మోదీ చెప్పుకొచ్చారు. పాత భవనంలో సాంకేతిక సమస్యలు కూడా ఉండేవని తెలిపారు. కొత్త భవనంలో ఎక్కువమంది సభ్యులు కూర్చోవడం కుదురుతుందని, ఆధునిక వసతులు కూడా ఉన్నాయని వివరించారు. కొత్త పార్లమెంటు భవనంలో 1272 మంది కూర్చోవడం కుదురుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

కొత్త పార్లమెంట్ భవనంలో ఆధునిక సౌకర్యాలపై మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా గ్రామాలను కలుపుతూ 4 లక్షల కిలోమీటర్లకు పైగా రహదారులను నిర్మించడం సాధించిన ఘనతను ఆయన ఎత్తిచూపారు. పార్లమెంట్‌లో తీసుకునే ప్రతి నిర్ణయం సమాజంలోని అన్ని వర్గాల భవిష్యత్తును నిర్ణయిస్తుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. పేదరిక నిర్మూలన, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా పార్లమెంట్‌లో రూపొందించిన చట్టాలు ఉన్నాయని పేర్కొన్నారు.