పిల్లల ఉచిత, నిర్బంధ విద్యా హక్కు (RTE) చట్టం కింద పాఠశాలల్లో చేరిన ఎకనామికల్లి వీకర్ సెక్షన్ (EWS) విద్యార్థులకు పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ల ఖర్చులతో సహా అన్ని ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని మద్రాస్ హైకోర్టు తాజాగా తీర్పు చెప్పింది. ఈ చట్టం కేవలం ట్యూషన్ ఫీజులకే రీయింబర్స్‌మెంట్‌ను పరిమితం చేయదని, EWS విద్యార్థులపై భారం పడకుండా ఉచిత, నిర్బంధ విద్యను అందించడం రాష్ట్ర బాధ్యత అని కోర్టు నొక్కి చెప్పింది.
ఆర్‌టీఈ చట్టం కింద ప్రైవేట్ స్కూల్‌లో ప్రవేశం పొందినప్పటికీ యూనిఫాం, స్టడీ మెటీరియల్‌ల కోసం అదనపు ఫీజులు చెల్లించలేకపోతున్నామంటూ ఓ విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఫీజు నిర్ధారణ కమిటీ నిర్ణయించిన ట్యూషన్ ఫీజులను మాత్రమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. అయితే, విద్యాభ్యాసానికి పుస్తకాలు, యూనిఫాంలు, ఇతర మెటీరియల్‌లు చాలా అవసరమని, వాటిని రాష్ట్రం తిరిగి చెల్లించాలని కోర్టు పేర్కొంది.