BJP : బీజేపీ స్టాండును గమనిస్తున్నారా ?

BJP : షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మిత్రపక్షం బీజేపీ స్టాండ్ మెల్లిగా మారుతోందా ? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. గడచిన నాలుగురోజులుగా బీజేపీ చీఫ్ సోమువీర్రాజు, జాతీయ అధికారప్రతినిధి, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన ప్రకటనలు చూసిన తర్వాత అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే మూడు రాజధానుల విషయంలో కమలనాదుల వైఖరిలో మార్పులు వస్తున్నట్లుంది.

2014-19 మధ్య చంద్రబాబునాయుడు రాజధానిగా అమరావతిని ప్రకటించినపుడు మిత్రపక్షమైన బీజేపీ కూడా ఓకే చేసింది. తర్వాత 2019 ఎన్నికల్లో అఖండ విజయంతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ప్రతిపాదించారు. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, కర్నూలును న్యాయరాజధానిగా అంటే హై కోర్టు ఏర్పాటు చేస్తారు. చివరకు అమరావతిలో శాసనరాజధాని అంటే అసెంబ్లీ కంటిన్యు అవుతుంది. మొదట్లో ఈ ప్రతిపాదనకు చంద్రబాబు అండ్ కో కు మైండ్ బ్లాంక్ అయిపోయింది.

bjp strategy planing
bjp strategy planing

నాలుగు రోజుల తర్వాత తేరుకుని జగన్ ప్రతిపాదనను వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. అప్పట్లో బీజేపీ నేతలు ఏమీ నోరిప్పలేదు. కొందరు మాత్రం జగన్ ప్రతిపాదనను స్వాగతించారు. తర్వాత మూడు రాజధానుల ఏర్పాటు రాష్ట్రప్రభుత్వం ఇష్టమని తప్పించుకుని తిరిగారు. కారణాలు ఏవైనా చివరకు రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలనే డిమాండ్ మొదలుపెట్టారు. చంద్రబాబు డిమాండుకు తగ్గట్లే మూడు రాజధానులు వద్దని అమరావతే ముద్దని డిమాండ్లు వినిపించారు. ఇదే డిమాండుతో కమలనాదులు కొంతకాలం బాగానే రచ్చ చేశారు.

న్యాయస్ధానం టు దేవస్ధానం అనే యాత్రను అమరావతి రైతుల ముసుగులో జనాలు చేపడితే దానిలో బీజేపీ నేతలు చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. రాజధాని విషయంలో బీజేపీ నేతలకు మంచి క్లారిటితోనే ఉందని అనుకుంటున్న నేపధ్యంలోనే స్టాండ్ మారిందా అనే డౌట్లు మొదలయ్యాయి. దీనికి కారణం ఏమిటంటే కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉంటే అందుకు కేంద్రప్రభుత్వం సహకరిస్తుందని సోమువీర్రాజు ప్రొద్దుటూరులో చెప్పారు. ఇదే విషయాన్ని వైజాగ్ మీడియా సమావేశంలో జీవీఎల్ కూడా బల్లగుద్ది చెప్పారు.

బీజేపీలోని కీలకనేతల తాజా తీరుచూసిన తర్వాత అందరిలోను జగన్ ప్రతిపాదనకు బీజేపీ మద్దతిస్తోందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. మరీ స్టాండును పవన్ కల్యాణ్ గమనిస్తున్నారా అనేది ఇపుడు కీలకమైంది. ఎందుకంటే పవన్ స్టాండ్ కూడా అంతా అమరావతిలో ఉండాలనే. కానీ మిత్రపక్షం మెల్లిగా తన స్టాండును మార్చుకుంటే అప్పుడు పవన్ ఏమి చేస్తారు ? పవన్ కూడా తన స్టాండును మార్చుకుంటారా ? లేకపోతే స్టాండ్ మార్చుకుంటున్న బీజేపీకి దూరమైపోతారా ? ఏదేమైనా షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేకొద్దీ స్టాండు విషయంలో బీజేపీలో మరింత క్లారిటి వచ్చే అవకాశముంది. అప్పుడు పవన్ ఏమిచేస్తారో చూడాలి.