ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా కొత్తపల్లిలో టీడీపీ లీడర్స్ అయిన భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడిన సంగతి విదితమే. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా జరిగిన ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డికి గాయాలయ్యాయి. అయితే అఖిల ప్రియ వర్గం తనపై మర్డర్ అట్టెంప్ట్ చేసిందని సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అఖిల ప్రియా రెడ్డితో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆపై నంద్యాల కోర్టు ఎదుట హాజరు పరిచారు. కాగా కోర్టు వీరి కేసును పరిశీలించి అఖిలప్రియ దంపతులకు 14 రోజుల రిమాండ్ విధించింది. అంటే ఈ నెల 30 వరకు వారు రిమాండ్ లోనే ఉండాలి. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఈ దంపతులను కర్నూలు సబ్ జైలుకు తరలించారు. అఖిలప్రియ తన భర్తతో కలిసి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ దాడి తర్వాత అఖిల ప్రియ కూడా తన చున్నీ లాగి, బట్టలు చించేశారని ఏవి సుబ్బారెడ్డి వర్గీయులపై కేసు పెట్టారు. దీనిపై కూడా కేసు నమోదు అయింది.