దేశ రాజధానిలో ప్రత్యేక హంగులతో రూపుదిద్దుకున్న పార్లమెంట్ భవనం ఈ నెల 28వ తారీఖున ప్రారంభం కానుందనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరు కానున్నట్టు తెలుస్తోంది.
ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా ప్రత్యేకంగా 75 రూపాయల నాణేన్ని విడుదల చేయనుండడం విశేషం. కాసేపటి క్రితమే ఈ మేరకు ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇక ఈ నాణెం ప్రత్యేకతలు ఏమంటే, ఒకవైపు జాతీయ చిహ్నాలైన 3 సింహాలు, మరో వైపు కొత్త పార్లమెంట్ భవనాన్ని ముద్రించారు. కాగా ఈ నాణెం 44 మిల్లీ మీటర్ల డయాను కలిగి ఉంటుంది. 200 సెర్రేషన్స్‌తో ఇది తయారయింది. 50 శాతం సిల్వర్, 40 శాతం కాపర్, అయిదు చొప్పున నికెల్, జింక్ ధాతువులను ఈ కాయిన్ తయారీలో వినియోగించినట్టుగా తెలుస్తోంది.