టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. రెండు రోజుల క్రితం శరత్ బాబు మృతి చెందాడంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి విదితమే. కాగా ఈ వార్తపై శరత్ బాబు సోదరి స్పష్టత ఇస్తూ శరత్ బాబు బతికే ఉన్నారని, ఆయన మృతిపై వస్తున్న వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని చెప్పుకొచ్చారు. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని కూడా ఆమె తెలిపారు. ఈ తరుణంలో అయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని శోకాన్ని మిగిల్చింది.
త్వరలోనే శరత్ బాబు కోలుకుని అందరి ముందుకు వస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేసిన సరిగ్గా రెండు రోజుల తరువాత ఇలా జరగడం చాలా బాధాకరం. అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్న విషయం అందరికీ తెలిసినదే. శ్రీకాకుళంలోని ఆముదాలవలసలో జూలై 31,1951లో జన్మించిన ఆయన.. 1973లో ‘రామరాజ్యం’ సినిమాలో మొదట హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. మొత్తం 200కు పైగా సినిమాల్లో నటించిన శరత్ బాబు.. మూడు చిత్రాలకు గాను ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు.