అక్కడ తులం బంగారం రూ.30 వేలే.. పోటెత్తుతున్న భారతీయులు..

ప్రస్తుతం 10 గ్రాముల బంగారం విలువ రూ.60 వేలకు పైగా నడుస్తోంది. కొన్నేళ్ల క్రితం తులం బంగారం చాలా తక్కువ ఉండేది కానీ సంవత్సరాలు గడుస్తున్నా కొద్దీ రెక్కలు వచ్చినట్లుగా పసిడి మధ్యతరగతి ప్రజలకు అందనంత ఎత్తుకు చేరుకుంది. భారతీయులకు గోల్డ్ ఒక ఎమోషన్ అని చెప్పవచ్చు. ప్రతి శుభకార్యంలో పసిడికి ఉన్న ప్రాముఖ్యత మరే దానికి ఉండదు. స్టేటస్ ప్రదర్శించడానికి బంగారానికి మించిన లోహం మరొకటి లేదు. మంచి పెట్టుబడి ఎంపికగా కూడా బంగారం నిలుస్తుంది. భారతీయులు దగదగా మెరిసేపోయే ఈ బంగారాన్ని తక్కువ ధరలకే సొంతం చేసుకోవడానికి విదేశాల నుంచి కూడా తెప్పించుకుంటున్నారు. ముఖ్యంగా దుబాయ్‌లో తక్కువ ధరకే బంగారం దొరకడం వల్ల ఆ దేశానికి తరచుగా వెళుతుంటారు.

అయితే ఇప్పుడు దుబాయ్ కంటే తక్కువ ధరకే మరో దేశం బంగారం అమ్ముతూ భారతీయులందరినీ దృష్టిని ఆకర్షిస్తోంది. అదే భూటాన్ దేశం. ఈ దేశం ట్యాక్స్-ఫ్రీ గోల్డ్‌ను అమ్ముతుండగా అక్కడ బంగారం చాలా తక్కువ ధరకే లభిస్తోంది. భూటాన్ ప్రభుత్వం ఈ ఆఫర్‌ను ఫిబ్రవరి 2023లోనే ప్రవేశపెట్టింది, పర్యాటకాన్ని పెంచడానికి, భారతదేశం నుంచి ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఈ దేశం బంగారాన్ని పన్ను సుంకం తీసుకోకుండా అమ్ముతోంది.

పన్ను రహిత గోల్డ్ ఆఫర్‌కు అర్హత పొందడానికి, భారతీయులు మొదటగా సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఫీజు (SDF) చెల్లించాలి. SDF అనేది భూటాన్‌లోకి ప్రవేశించేటప్పుడు పర్యాటకులందరూ తప్పనిసరిగా చెల్లించాల్సిన రోజువారీ రుసుము. భారతీయ పర్యాటకులకు, SDF ఒక వ్యక్తికి రోజుకు రూ.1,200-1,800 లోపు ఉంటుంది. ఈ ఫీజు చెల్లించడంతోపాటు భూటాన్‌లోని టూరిస్ట్-సర్టిఫైడ్ హోటల్‌లో కనీసం ఒక రాత్రి బస చేయాలి.

బంగారం కొనుగోలు చేసేటప్పుడు US డాలర్లలో చెల్లించాలి. ఈ షరతులను నెరవేర్చిన తర్వాత, మీరు భూటాన్‌లో లైసెన్స్ పొందిన బంగారం డీలర్ల నుంచి పన్ను రహిత బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. బంగారాన్ని అంతర్జాతీయ మార్కెట్ ధరకు విక్రయిస్తారు, అయితే ఎలాంటి పన్నులు లేదా సుంకాలు చెల్లించాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆ డబ్బు అంతా మీకు ఆదా అవుతుంది. ప్రస్తుతం భూటాన్‌లో వివిధ క్యారెట్లలో 10 గ్రాముల బంగారం ధరలు చూసుకుంటే, 24-క్యారెట్ బంగారం రూ.59,090, 22-క్యారెట్ గోల్డ్ రూ.54,910, 21-క్యారెట్ బంగారం రూ.51,040, 18 క్యారెట్ల బంగారం ధర రూ.45,140గా ఉన్నాయి. ఇంకా తక్కువ స్వచ్ఛమైన బంగారం కేవలం 30 వేలకే దొరుకుతుంది. ఎక్కువ మొత్తంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు భూటాన్ కి వెళ్లి బాగా మనీ సేవ్ చేసుకోవచ్చు.