‘బేబీ’ సినిమా కలెక్షన్లు చూసి బాబోయ్ అంటున్న ట్రేడ్ వర్గాలు?

ఈ మధ్యకాలంలో ఒక సినిమా చాలా సైలెంట్ గా వచ్చి కలెక్షన్ల వయొలెంట్ క్రియేట్ చేసింది అంటే అది బేబీ సినిమానే అని వేరే చెప్పాల్సిన పనిలేదు. అవును, ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఊహించని రీతిలో హిట్ కొట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. విడుదలై 2 వారాలు కావొస్తున్నా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతూ తన ఉనికిని చాటుకుంటోంది. దర్శకుడు సాయిరాజేశ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా హిట్ అవ్వడమే కాదు, విమర్షకుల నుంచి కూడా ప్రశంసలు పొందింది. ఈ నెల 14న విడదలైన బేబీ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీతో యూత్ ను తెగ ఆకట్టుకుంటోంది అంటే నమ్మితీరాలి.

ఈ క్రమంలో తాజాగా మరో రికార్డును బ్రేక్ చేసింది ఈ సినిమా. అవును, నేటి తరం యువతలో ప్రేమ విషయంలో చోటుచేసుకుంటున్న వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు దర్శకుడు చూపించడంతో యూత్ కి ఈ సినిమా ఫుల్ గా కనెక్ట్ అయిపోయింది. దీంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అయితే తాజాగా బేబీ మూవీ కేజీఎఫ్2 సినిమా సాధించిన రికార్డును బ్రేక్ చేసి టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. వరుసగా రోజుకు రూ. కోటి కలెక్షన్లతో కేజీఎఫ్2 మూవీ సాధించిన రికార్డును బ్రేక్ చేసింది. కేజీఎఫ్2 సినిమా 12 రోజుల పాటు వరుసగా కోటి రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోగా బేబీ మాత్రం 13 రోజుల పాటు కోటి రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది. బేబీ సినిమా సక్సెస్ తో ఇందులోని నటీనటులకు సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి అని టాలీవుడ్లో గుసగుసలు మొదలయ్యాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాను చూసిన టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని చిత్రయూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. బేబీ సినిమాను చూశానని, తనకు బాగా నచ్చిందని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు. ఈ సంద‌ర్భంగా ‘బేబీ’లో క‌థ‌నాయిక‌గా న‌టించిన వైష్ణవి చైతన్యకు, బేబి టీంకు ఫ్లవర్స్ బోకే అందజేశారు రామ్. ఇక ఈ విష‌యాన్ని హీరోయిన్ వైష్ణవి చైతన్య సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. బేబీ సినిమా చూసి ఫ్లవర్స్ పంపినందుకు ధన్యవాదాలు రామ్.. నా త‌ర‌పున, బేబీ టీమ్‌ త‌ర‌పున మీకు థాంక్స్ అంటూ వైష్ణవి ట్విట్ట‌ర్‌లో రాసుకోచ్చింది.

కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా విషయానికొస్తే రోజు రోజుకు విశేష ఆదరణ లభిస్తోందని చెప్పుకోవచ్చు. వీక్ డేస్ లో కూడా చాలా చోట్లా హౌజ్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి అంటే అర్ధం చేసుకోవచ్చు. దీనితో పాటు రిలీజైన 2 అరవ డబ్బింగ్‌ సినిమాలు కూడా సో సోగా ఆడడంతో ఈ సినిమాకు తిరుగులేకుండా పోయింది. దాంతో జనాలకు వేరే ఆప్షన్‌ కూడా లేకపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ దీని పట్ల అంత సుముఖంగా లేనప్పటికీ కాలేజీ కుర్రకారుతో పాటు ఆటో మాస్ జనాలు మాత్రం ఈ సినిమాకి బ్రహ్మరధం పడుతున్నారని టాక్. కాగా ఈరోజు బ్రో సినిమా రిలీజ్ అయింది కాబట్టి, కలెక్షన్లు కాస్త తగ్గే అవకాశం లేకపోలేదు.