అవినాష్ రెడ్డి పని అయిపోయినట్టే… వివేకా కేసులో అఫ్రూవర్ గా పీఏ కృషారెడ్డి?

వైఎస్ వివేకా హత్య కేసులో తనను బాధితునిగా పరిగణించాలంటూ పిఏ కృష్ణారెడ్డి వేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసిన సంగతి అందరికీ తెలిసినదే. అదేవిధంగా ఈ కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని సవాల్ చేసే అధికారం తనకు కూడా ఉందని, దానికి ఆదేశాలు ఇవ్వాలని కోరగా ఆ అభ్యర్ధనను మాత్రం కోర్టు తోసిపుచ్చింది. ఇక ఈ కేసులో జోక్యానికి సిద్ధంగా లేమని చెప్పిన సుప్రీం కోర్టు వాద, ప్రతివాదుల అభిప్రాయాలు హైకోర్టు ముందే చెప్పుకోవాలని, దానికి వేరే మార్గాన్ని అన్వేషించొద్దని వారికి సూచించింది. ఈ కేసుకు సంబంధించి తమ అభిప్రాయం లేకుండా హైకోర్టు సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీం ఈ సందర్భంగా అభిప్రాయపడింది.

దీనిపై రేపు లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వనున్నట్టు కోర్టు స్పష్టం చేసిన సంగతి కూడా వినే వుంటారు. ఇదిలా ఉంటే ఈ కేసులో అరెస్ట్ అయి, చంచల్ గూడ జైల్లో ఉన్న ఆరుగురు నిందితులకు సీబీఐ కోర్టు రిమాండ్ ను పొడిగించడం గమనార్హం. నిందితులు సునీల్ యాదవ్, ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి రిమాండును జులై 14 వరకు సీబీఐ కోర్టు పొడిగించింది. ఇదే రోజున సీబీఐ అనుబంధ ఛార్జ్ షీట్ ను దాఖలు చేయడం కొసమెరుపు. ఇప్పటివరకు 2 ఛార్జ్ షీట్ లు దాఖలు చేయగా తాజాగా మూడో ఛార్జ్ షీట్ ను సీబీఐ దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్ కడప ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిపై దాఖలు చేసింది.

ఇక ఈ కేసులో కీలకంగా మారిన వివేకా రాసిన లేఖను నిన్ హైడ్రిన్ పరీక్ష చేసేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. హత్యకు ముందు వివేకా రాసిన లేఖగా దానిని పేర్కొనగా వేలిముద్రలను గుర్తించడానికి ఈ పరీక్ష చేయలని సిబిఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ మేరకు విచారణ జరిపిన కోర్టు నిన్ హైడ్రిన్ పరీక్ష చేసేందుకు అనుమతి కూడా ఇచ్చింది. కాగా లేఖపై ఉన్నవేలిముద్రలను గుర్తించాలని CFSLను సీబీఐ కోరింది. కానీ ఇందుకు కోర్టు అనుమతి తీసుకోవడం తప్పనిసరి కావడంతో సీబీఐ పిటీషన్ దాఖలు చేసింది.

అయితే, గతంలోనే ఈ లేఖను CFSLకు పంపించగా ఆ సమయంలో వివేకా ఒత్తిడిలో ఈ లేఖ రాసినట్లు చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఆ లేఖ రాసిన వేలిముద్రలను గుర్తించాల్ససిందే అని సీబీఐ కోర్టును ఆశ్రయించింది. దీని ద్వారా అసలు ఆ లేఖ ఎవరు రాశారో తేలిపోనుందని సిబిఐ తేల్చనుంది. ఈ మేరకు సీబీఐ కోర్టును ఆశ్రయించగా..అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ కధలో తాజా ట్విస్ట్ ఏమంటే ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటున్న అవినాష్ రెడ్డి పని ఇక అయిపోయినట్టేనని కొంతమంది భావిస్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో పీఏ కృషారెడ్డి అఫ్రూవర్ గా మారనున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.