Ashok Gajapathi Raju: కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. తమకు వంశపారపర్యంగా వచ్చే సింహాచలం ధర్మకర్తల మండలి ధర్మకర్త బాధ్యతలను రబ్బర్ స్టాంప్ గా చూడొద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేనేమీ రబ్బర్ స్టాంప్ నీ కాను, మీ ఇష్టం వచ్చిన అజెండా పంపి ఆమోదించడానికి, అజెండా అంటే చైర్మన్ అయిన నేను కానీ లేదంటే కార్యనిర్వాహన అధికారి కానీ తయారు చేయాలి.

కానీ ముందే నిర్ణయాలు తీసుకుని రాటిఫికేషన్ కోసం పంపినట్టు పంపితే నేను ఆమోదించాలా?.. నెవర్ అంటూ ప్రభుత్వ అధికారుల తీరు మీద ఫైర్ అయ్యారు. అయిపోయిన పనులకు సంతకాలు చేయటం ఏంటి అని సింహాచలంలో మీడియాతో మాట్లాడుతూ సీరియస్ అయ్యారు. ఇదే సమయంలో ట్రస్ట్ బోర్డు సమావేశం విషయంలో తమకు మూడు తేదీలను సూచిస్తే తాము ఒక తేదీని నిర్ణయిస్తామని చెప్పుకొచ్చారు.
నాలుగు నెలల క్రితం జరిగిన చందనోత్సవం ఏర్పాట్ల పైన కూడా అశోక్ గజపతిరాజు మండిపడ్డారు.అశోక్ గజపతిరాజు ధర్మకర్త మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకుడు. దాంతో ఆయన ప్రభుత్వ తీరుని తనదైన శైలిలో తప్పు పట్టడంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సింహాచలం దేవస్థానం విషయంలో ప్రభుత్వ పనితీరు అసలు ఏమాత్రం బాగోలేదని ఆయన అంటున్నారు.