ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ఇండియా లోకల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన MX ప్లేయర్‌ని టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్ (TIL) నుంచి చాలా తక్కువ ధరకు సొంతం చేసుకుంది. ఈ ప్లేయర్‌ను హస్తగతం చేసుకోవడానికి అమెజాన్ ఇండియా ఎంత ధర చెల్లించిందనేది కచ్చితంగా తెలియ రాలేదు. అయితే ఈ అమౌంట్ దాదాపు 45-50 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు.
ఇది 2018లో MX ప్లేయర్ కోసం టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్ 130 మిలియన్ డాలర్లు చెల్లించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంటే ఇప్పుడు అమెజాన్ ఇండియా దీనిని దాదాపు మూడు రెట్లు తక్కువ ధరతో సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఈ డీల్‌పై అమెజాన్ వ్యాఖ్యానించలేదు. MX Player 2022లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన మూడవ ఓటీటీ యాప్‌గా చరిత్ర సృష్టించింది. ఒక్క భారతదేశంలోనే దాదాపు 78 మిలియన్ల మంది వినియోగదారులను ఇది కలిగి ఉంది.
ఇండియన్ మార్కెట్‌లో ఓటీటీల సంఖ్య పెరగడంతో పోటీ అనేది తారస్థాయికి చేరుకుంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆయా కంపెనీలు తమకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవలే రిలయన్స్ గ్రూప్ ఆధీనంలోని జియో సినిమా కూడా వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. జియో సినిమా ఐపీఎల్‌ని ఫ్రీగా ప్రసారం చేసింది, ఐదేళ్లపాటు IPL డిజిటల్ మీడియా హక్కులను పొందేందుకు $3.2bn ఖర్చు చేసింది.