మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా ఆగస్ట్ 11న రాబోతోన్న నేపథ్యంలో నిన్న అనగా ఆదివారం నాడు గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ ఈవెంట్‌లో అనేకమంది చిరంజీవి మీదున్న ప్రేమను, అభిమానాన్ని ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో హైపర్ ఆది ఏ రకంగా స్పీచ్ ఇచ్చాడో అందరికీ తెలిసినదే. ఆ తరువాత మాట్లాడిన అల్లు అరవింద్ సైతం తన ప్రేమను చాటుకున్నాడు. మాట్లాడింది కొద్ది సేపే గానీ.. చిరు మీద ఎంత అభిమానం, ప్రేమ ఉందో చెప్పకనే చెప్పేశాడు బావ అల్లు అరవింద్.
అది 2008. చిరంజీవి తన రాజకీయాన్ని మొదలు పెట్టిన సంవత్సరం. ఆ తరువాత రాష్ట్రంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. టాలీవుడ్లో కూడా కొందరు కుసంస్కారులు చిరుపైన తమ అక్కసుని వెళ్లగక్కారు. ఈ క్రమంలో జీవితా రాజశేఖర్‌లు ఎలాంటి కామెంట్లు చేశారో అందరికీ తెలిసిందే. చిరంజీవిని కిందకు లాగేందుకు నానా రకాల ప్రయత్నాలు జరిగాయి అప్పట్లో. ఆఖరికి ఎంతో సేవాదృక్పథంతో పెట్టిన బ్లడ్ బ్యాంక్ మీద కూడా ఆరోపణలు, విమర్శలు చేయడం జరిగింది. ఈ జంట చిరు సేవ కార్యక్రమాల పేరిట రక్తం అమ్ముకుంటున్నారని నాడు కామెంట్లు చేసిన సంగతి తెలిసినదే.
అయితే చేసిన పాపం ఊరికే ఉండదు కదా. ఈ మధ్యే జీవితా రాజశేఖర్‌కు కోర్టు జైలు శిక్ష విధించింది. నాటినుండి నేటివరకు వాళ్లు అలా మాట్లాడరని అల్లు అరవింద్ సుధీర్ఘమైన పోరాటం చేశాడు. వారి మీద పరువునష్టం దావాను వేశాడు. అది కోర్టులో ఇన్నాళ్లు నడుస్తూ ఈ మధ్యే తీర్పు వచ్చింది. ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానాను కూడా కోర్టు విధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని అల్లు అరవింద్ పరోక్షంగా స్టేజ్ మీద గుర్తు చేశాడు. చిరంజీవిని, ఆయన చేసే సేవా కార్యక్రమాల గురించి మాట్లాడితేనే తాను ఊరుకోలేదని, పోరాటం చేసి మరీ జైలుకి పంపించాను.. చిరంజీవి అంటే తనకు అంత ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు.
ఎంతైనా బావ బావమరిది బంధం అలాంటిది మరి. ఇక దాంతో అల్లు మెగా కాంపౌండ్ మధ్య దూరం ఉందనే పిచ్చి రూమర్లకు కూడా అరవింద్ ఇలా పుల్ స్టాప్ పెట్టినట్టు అయింది. ఈ విషయాన్ని అటు మెగాభిమానులు, ఇటు అల్లువారి అభిమానులు కూడా సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. ఎందుకంటే ప్రతీ సారి అల్లు మెగా మధ్య దూరం పెరిగిందనే టాక్ ఎక్కువగా వినిపిస్తుంటుంది. అల్లు అర్జున్ సొంత కుంపటి పెట్టుకున్నాడని, మెగా అనే పదాన్ని కూడా తలుచుకోవడానికి ఇష్టపడటం లేదనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో వాటికి సమాధానంగా నిన్న అల్లు అరవింద్ మాట్లాడిన మాటలతో మెగా అల్లు కాంపౌండ్‌లు ఎప్పటికీ ఒక్కటే అని అందరికీ అర్థమై ఉండొచ్చు అని ఇరు కుటుంబాల అభిమానులు అభిప్రాయపడుతున్నారు.