Health Tips మన చుట్టుపక్కల నిత్యం పొలాల కంచెల వెంబడి, తోటల్లో, రోడ్లకు ఇరు వైపులా, చెట్లకు అల్లుకుని పెరిగే తీగ జాతి మొక్కల్లో దుష్టపు తీగ మొక్క కూడా ఒకటి. ఈ మొక్క గ్రామాల్లో విరివిరిగా కనిపిస్తుంది. దీనిని దుష్టపు చెట్టు, జుట్టుపాకు అని కూడా పిలుస్తారు. దీనిని సంస్కృతంలో ఉత్తమా రాణీ, కాకజంగ, కురూతక అని హిందీలో ఉత్తరణ్, గడారియా కి బెల్, జూటక్ అని పిలుస్తారు. ఈ మొక్క చూడడానికి తిప్ప తీగలాగా ఉంటుంది. ఈ మొక్క ఆకులు హృదయాకారంలో, పలుచగా ఉంటాయి. దుష్టపు తీగ మొక్కకు గుత్తులు గుత్తులుగా పూలు, ముళ్ల లాంటి కాయలు ఉంటాయి. ఈ కాయలు ఎండిపోయిన తరువాత వీటి నుండి దూది లాంటి విత్తనాలు వస్తాయి. అంతేకాకుండా దుష్టపు తీగ మొక్క ఆకులు, పూలు, కాయలు తెంపినప్పుడు పాల లాంటి ద్రవం కారుతుంది. ఇది పైపుతలా వాడితే అనేక అనారోగ్య సమస్యలు నయం అవుతాయి.. ఈ మొక్క వలన కలిగే ఆరోగ్య లాభాలు గురించి తెలుసుకుందాం..
విరోచనాలు, దగ్గు, ఉబ్బసం, ఆర్థరైటిస్, బ్రాంకటైజ్, ఫైల్స్, కాలేయ సమస్యలు, చర్మ సమస్యలు, గర్భాశయ సమస్యలను నివారించడంలో ఈ మొక్క మనకు ఎంతగానో సహాయపడుతుంది. తేలు కాటుకు గురి అయినప్పుడు ఈ మొక్క వేరును నీటితో అరగదీసి ఆ మిశ్రమాన్ని కాటుకు గురి అయిన చోట ఉంచడం వల్ల విషం విరిగిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకుల కషాయం తయారుచేసుకొని తాగితే దగ్గు, ఉబ్బసం తగ్గుతయి.
ఈ మొక్క ఆకులను నాలుగు గ్రాముల మోతాదులో తీసుకుని నెయ్యిలో వేయించి తినడం వల్ల పొట్టలో నులి పురుగుల సమస్య తగ్గుతుంది. కీళ్ల నొప్పులతో బాధపడే వారు దుష్టపు తీగ ఆకుల నుండి తీసిన రసంలో కొద్దిగా అల్లం రసాన్ని కలిపి ప్రతిరోజూ తీసుకోవాలి. ఇలా చేస్తే కీళ్ల నొప్పలు త్వరగా తగ్గుతాయి. ఈ మొక్క ఆకుల రసం నుండి తీసిన రసంలో రాళ్ల ఉప్పును వేసి ఉప్పు కరిగే వరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు లేదా మూడు చుక్కల మోతాదులో చెవిలో వేసుకోవడం వల్ల చెవి నుండి చీము కారడం, చెవి నుండి వాసన రావడం, చెవి నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.
ఈ ఆకుల పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో మజ్జిగలో లేదా పెరుగులో కలిపి ఋతుస్రావం వచ్చిన మొదటి రోజు నుండి ఐదు రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల గర్భాశయ దోషాలు తొలగిపోయి చక్కటి సంతానం కలుగుతుంది.