Health Benefits : హిందూ సంప్రదాయం ప్రకారం చెట్లను పూజించడం అనవాయితీ.. వాటిల్లో ముఖ్యంగా వేప చెట్టు, రావి చెట్టు, మారేడు చెట్టు చాలా పవిత్రమైనదిగా భావించి పూజిస్తారు. ఇలాంటి చెట్లలో ఎంతో ముఖ్యమైనది మారేడు చెట్టు. ఈ మారేడు చెట్టు అంటే ఆ పరమశివునికి ఎంతో ప్రీతికరం అని హిందూ ధర్మంలో చెబుతుంటారు . మారేడు ఆకులు మూడు ఆకులు కలిపి ఒకే ఈనెలో ఉంటాయి.అయితే ఈ చెట్టు పవిత్రమైనదే కాదు ఎన్నో ఔషదగుణాలను కలిగి ఉంది. మంచి ఔషద గుణలున్న మారేడు చెట్టు పండ్లు, కాయలు, ఆకులు, పువ్వులు, బెరడు, వేర్లను ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. మారేడు చెట్టు ఖనిజాల నెలవు అని చెప్పొచ్చు.అవేంటో ఇప్పుడు చూద్దాం.. మారేడు ఆకులలో శరీరానికి అత్యవసర పోషకాలన్ని ఇందులో మనకు దొరుకుతాయి.
ఇందులో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్, అలాగే విటమిన్ బీ, సీ పుష్కలంగా ఉంటాయి. దీని ఆకుల నుంచి తీసిన రసము మధుమేహ వ్యాధి నివారణకు చాలా బాగా ఉపయోగపడుతుంది . మారేడు పండ్లనుంచి వచ్చే సువాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనికి శరీరంలోని వేడిని తగ్గించే గుణం ఉంది. వీటి పండ్లు వగరుగా ఉండి వీరేచనాల తో బాధపడుతున్న వారికి మంచి మందుగా పని చేస్తాయి. ఆయుర్వేదంలో మారేడు వేరును చర్మసంబంధిత లేపణాల్లో ఉపయోగిస్తారు. మారేడు ఆకుల రసం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను క్రమభద్దికరించి మధుమేహంను కంట్రోల్ లో ఉంచుతుంది. మారేడు ఆకులను బిల్వ ఆకులు అని కూడా పిలుస్తారు. ఈ ఆకుల రసం తీసి కొంచెం తేనె కలిపి తాగడం వల్ల అధిక జ్వరం కూడా ఇట్టే తగ్గుతుంది. జీర్ణశయంలో పుండుతో బాధపడుతుంటే బిల్వ ఆకుల రసం తీసుకోవడం వల్ల పుండ్లు నయమవుతాయి.
అంతే కాకుండా ఇది శరీరాన్ని డీ టాక్సిఫై చేస్తుంది. అలాగే మలేరియాను కూడా తగ్గించే గుణం మారేడు ఆకులకు, పండ్లకు ఉంది. రక్త సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వాళ్లు ఈ పండ్ల రసం తీసి అందులోకి కొంచెం అల్లం రసం కలిపి తాగడం వల్ల చక్కటి ఉపశమనం లభిస్తుంది. మారేడు ఆకులు కానీ,బెరడు కానీ తీసుకొని మెత్తగా నూరి గాయాల మీద లేపణంగా రాయడం వల్ల గాయాలు తొందరగా తగ్గుముఖం పడతాయి.బాగా పండిన మారేడు పండులోని గుజ్జు తినడంవల్ల దీర్ఘకాలికంగా ఉన్న మలబద్దక సమస్య తగ్గిపోతుంది.అధిక ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవాళ్లు మారేడు ఆకులతో కషాయం చేసుకుని తాగడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కారకాలతో పోరాడే గుణం ఉంటుంది.