Nursery Business : ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచించే ప్రతి ఒక్కరూ కూడా నర్సరీలను పెట్టి కూడా అద్భుతమైన లాభాలను పొందవచ్చు . ముఖ్యంగా కూరగాయలను మొదలుకొని ఔషధాలకు సంబంధించిన మొక్కల వరకు అన్నీ కూడా మీరు మీ నర్సరీ ద్వారా పండించి, అమ్మి మరింత లాభం పొందే అవకాశం ఉంటుంది. ఎవరైతే నర్సరీలతో లాభాలు పొందాలని ఆలోచిస్తున్నారో అలాంటి వారికి ప్రభుత్వం కూడా సహాయపడుతుంది. లోన్ రూపంలో తక్కువ వడ్డీకే డబ్బులు ఇచ్చి నర్సరీ ఏర్పాటుకు సహాయపడుతుంది.ఏదైనా బిజినెస్ చేయాలనుకునే వారికి ఇదొక బెస్ట్ బిజినెస్ ఐడియా అని చెప్పవచ్చు.

వర్షాలు ఎక్కువగా పడుతున్న నేపథ్యంలో మొక్కల పెంపకం పై చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా నర్సరీలకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో చాలామంది ఇలా నర్సరీల వైపు మొగ్గు చూపుతున్నారు .మొక్కలను కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా ఎక్కువ అవుతున్నారు కాబట్టి ఇలా నర్సరీల ద్వారా కూరగాయలు, పండ్ల మొక్కలనే కాదు పువ్వుల మొక్కలను కూడా పెంచవచ్చు. ఒకప్పుడు నర్సరీలు అంటే కేవలం పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఉండేవి.. కానీ వీటిపై అవగాహన పెరిగిన తర్వాత గ్రామస్థాయికి కూడా విస్తరించాయి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద నర్సరీలను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం కూడా అందిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతో చాలామంది నర్సరీలను ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు . మొక్కలను విక్రయించడం ద్వారా ప్రతినెల 50 వేల నుండి లక్ష రూపాయల వరకు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. మీరు కూడా నర్సరీలను ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం లోన్ అందిస్తోంది. ఈ క్రమంలోనే నర్సరీ మొక్కలను ఏర్పాటు చేసే వారి కోసం ప్రతి సంవత్సరం కూడా ఆరు లక్షల రూపాయల నిధులను ఉపాధి హామీ పథకం కింద మంజూరు చేస్తోంది. నర్సరీ ఏర్పాటు చేసినప్పుడు ఒక్కో నర్సరీలో 50వేల మొక్కలను పెంచాల్సి ఉంటుంది . అప్పుడు ప్రభుత్వం మీకు ఒక్కో మొక్కకు నెలకు 1 రూపాయి చొప్పున ఈ పథకం కింద నిధులు మంజూరు అవుతాయి. అంటే నెలకు 50 వేల రూపాయల ఆదాయం సమకూరినట్టే కదా..
జాతీయ ఉపాధి హామీ పథకం కింద నర్సరీల ఏర్పాటు చేసే విషయంలో చిన్న, సన్నకారు రైతులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకున్న వారు వ్యవసాయ మంత్రిత్వ శాఖ నుంచి అవసరమైన సహాయక సహకారాలు పొందవచ్చు. నీటి సౌకర్యం ఉన్న స్థలాన్ని మనం అధికారులకు చూపిస్తే నర్సరీలు ఏర్పాటు చేసుకోవడానికి వారు అనుమతి ఇస్తారు. పూల మొక్కల్లో గులాబీ , చామంతి, బంతి పువ్వుల మొక్కలు ఏ సీజన్లో అయినా పెరుగుతాయి కాబట్టి మొక్కల పెంపకం చేపట్టవచ్చు. అలాగే టమాటో, పచ్చిమిరప, బెండ వంటి మొక్కలు కూడా పెంచవచ్చు. తులసి మొక్కలకు కూడా డిమాండ్ ఉంది కాబట్టి వీటిని కూడా మీరు పెంచవచ్చు. అలాగే సర్పగంధ , అశ్వగంధ, బ్రాహ్మి, అలోవెరా, ఉసిరి వంటి మెడికల్ ప్లాంట్స్ కూడా పెంచి మంచి ఆదాయం పొందవచ్చు.