kandukuri viresilingam: చరిత్ర నిజాలు : ఆ సంఘటన వీరేశలింగం గారి జీవితాన్నే మార్చేసింది !!

kandukuri viresilingam:  వీరేశలింగం గారి బాల్యం:
అయన ఒక గొప్ప సంఘ సంస్కర్త, తెలుగు జాతి మొత్తం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి. సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు అంతులేని కృషి చేసిన మహానుభావుడు ఆయన.సాహితీ వ్యాసంగంలో కూడా అంతటి కృషి చేసిన కందుకూరి వీరేశలింగం గారు బహుముఖ ప్రజ్ఞాశాలి అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఆయన తెలుగు జాతికి నవయుగ వైతాళికుడి గా చెప్పబడ్డారు.వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16 వ తేదీన పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు రాజమండ్రిలో జన్మించాడు. ఆయన పూర్వీకులు ఇప్పటి ప్రకాశం జిల్లా లోని కందుకూరు గ్రామం నుండి రాజమండ్రి కి వలస వెళ్లిన కారణం గా వారికి ఈ ఇంటి పేరు స్థిరపడిపోయింది అని అంటారు.వీరేశలింగంకు నాల్గవ సంవత్సరం లోనే తండ్రి మరణించారు. పెదతండ్రి, నాయనమ్మల పెంపకంలో అల్లారుముద్దుగా పెరిగారు. ఐదో వ సంవత్సరం లో బడిలో చేరి, బాలరామాయణం, సుమతీ శతకం, ఆంధ్ర నామ సంగ్రహం, అమరం, రుక్మిణీ కళ్యాణం, కృష్ణ శతకం మొదలైనవి అభ్యసించారు.

kandukuri viresilingam:  బాల్యవివాహం:

పన్నెండు సవత్సరాలకు రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషుమీడియం లో చేరాడు. చిన్న తనం నుంచి , అన్ని తరగతులలోనూ,మొదటి స్థానం లోనే ఉండేవాడు.
ఆయనకు 13 సవత్సరాలకు బాపమ్మ అనే ఎనిమిదేళ్ళ బాలికతో బాల్యవివాహం జరిగింది. పెరిగి పెద్దయ్యాక వీరేశలింగం ఇటువంటి దురాచారాలను నిర్ములించడానికే పాటు పడ్డారు .
కేశుబ్ చంద్ర సేన్ ప్రభావం :
చదువుకునే రోజు ల నుంచే కేశుబ్ చంద్ర సేన్ రాసిన పుస్తకాలు చదివి ప్రభావితుడయ్యాడు. విగ్రహారాధన చేయడం , పూజలు మొదలైన వాటి మీద నమ్మకం తగ్గడమే కాక, దయ్యాలు, భూతాలు లేవనే అభిప్రాయానికి వచ్చారు. ప్రజలకు అది నిరూపించడం కోసమని అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళేవాడు.

ఉపాధ్యాయ వృత్తి:

1867 వ సంవత్సరం లో పెదనాన్నమరణించడం తో ప్రభుత్వోద్యోగంలో చేరాలని ప్రయత్నించారు కాని లంచం ఇవ్వనిదే ఉద్జ్యోగం రాదని తెలిసి, ప్రభుత్వోద్యోగం చెయ్యకూడదని నిర్ణయించుకున్నాడు . న్యాయవాద పరీక్ష వ్రాసి, న్యాయవాద వృత్తి చేపడదామనిఅనుకున్న గాని, అందులో కూడా అవినీతి ఎక్కువగా ఉందనీ, అబద్ధాలు ఆడటం వంటివి తప్పనిసరి అనితెలుసుకుని , అదీ కూడా మానుకుని ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారు.

ఉపాధ్యాయుడిగా:

ఒక ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలు చెప్పడం తో పాటు, సంఘ సంస్కరణ భావాలను కూడా వారికీ బోధించాడు.
సమాజంలో ఉన్న దురాచారాలపై తన భావాలను వ్యాప్తి చెయ్యడానికి 1874 వ సంవత్సరం అక్టోబరు లో వివేకవర్ధని అనే పత్రికను మొదలు పెట్టారు. సంఘం లో ఉన్న అవకతవకలను ఎత్తి చూపడం, దురాచారాల నిర్మూలన, ప్రభుత్వ వ్యవస్థలో ప్రబలంగా ఉన్న అవినీతిని ఎత్తిచూపడం తో పాటు అవినీతిపరులను సంఘం ముందు పెట్టడం వంటివి వివేకవర్ధని లక్ష్యాలని ఆయన మొదటి సంచికలోనే తెలిపారు. ఆ మాట చెప్పడమే కాదు, అలాగే ఆ పత్రికను నడిపి చేతలలో చేసి చూపించారు. వివేకవర్ధని అవినీతిపరుల కు సింహస్వప్నము గా మారింది.
కందుకూరి గారికి సమకాలిక ప్రముఖుడైన కొక్కొండ వెంకటరత్నం పంతులు తో స్పర్ధలుఉండేవి. కందుకూరి వివేకవర్ధనిమొదలు పెట్టిన తరువాత కొక్కొండ హాస్య వర్ధని అనే పత్రికను మొదలు పెట్టారు . ఆ పత్రికకు పోటీగా కందుకూరి హాస్య సంజీవిని అనే హాస్య పత్రికను వీరేశలింగం గారు మొదలు పెట్టారు.

బ్రహ్మ సమాజం :

ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగం గారి తోనే ప్రారంభం కాబడినది. సమాజ సేవ కొరకు హితకారిణి అనే ధర్మ సంస్థనుపెట్టి , తన యావదాస్తిని దానికి ఇచ్చేసారు.
25 సంవత్సరాలు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఐదేళ్ళు తెలుగు పండితుడిగా పని చేసారు. తాను నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని ఏమాత్రం తొణకకుండా పాటించిన వ్యక్తి వీరేశలింగం గారు.

గద్య తిక్కన అనే బిరుదు :

యుగకర్త గా ప్రఖ్యాతి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు కూడా ఉంది. ఆంధ్ర సమాజాన్ని సంస్కరణల బాట లో నడిపించిన సంస్కర్త ఆయన.

స్త్రీ ల చదువుకోసం:

వీరేశలింగం గారు హేతువాది . ఆయన మొత్తం జీవితం సంఘసంస్కరణ, సాహిత్య కృషి లతో ముడివేసుకుని గడిచింది. వీటిని ఒకదానినుండి మరో దానినివేరు చేయలేము. ప్రభుత్వంలో జరుగుతున్నా అవినీతి మీద యావగింపుతో, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాన్ని, అబద్ధాలు ఆడక తప్పదని న్యాయవాద వృత్తిని వదులుకున్న వ్యక్తి అటువంటిదురాచారాలపైధ్వజమెత్తితనసంస్కరణాభిలాషను నెరవేర్చుకున్నారు. సంఘంలో జరుగుతున్నా ఇతర దురాచారాలపై ప్రజలలో చైతన్యం తేవడానికి పత్రికను ఆయుధంగా ఉపయోగించారు.సంఘసంస్కరణ చేయడానికి ప్రవచనాలు మాత్రం చెప్పివదిలేయలేదు. చెప్పినవి చేసి చూపించడం కోసం స్వయంగా నడుం కట్టి కార్యరంగంలోకిదిగారు. ఆ రోజుల్లోఆడవారికి విద్య అవసరం లేదని దృఢం గా భావించేవారు.వీరేశలింగం గారు స్త్రీ ల చదువుకోసం ఉద్యమించి, ప్రచారం చెయ్యడమే కాక, బాలికల కొరకు పాఠశాలను కూడా మొదలు పెట్టి తానే స్వయంగా చదువు చెప్పేవాడు.ఇంకా చెప్పాలి అంటే మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. అంటరాని తనానికి పెద్దపీట వేసిన ఆ రోజుల్లోనే తక్కువ కులాలు అని చెప్పబడే కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో పాటు వారిని కలిపి కూర్చోబెట్టడం తో పాటు వారికి ఉచితంగా చదువు చెప్పడం , పుస్తకాలు, పలకా బలపాలు కూడా కొనిచ్చేవారు .

వితంతు పునర్వివివాహం :

బాల్య వివాహాలకు ,కుల భేద నిర్మూలనకు ఆయన వ్యతిరేకంగా పోరాడారు. వేశ్యా వ్యవస్థ పాతుకుపోయిన ఆ రోజుల్లో దానికి వ్యతిరేకంగా వివేకవర్ధని లో వ్యాసాలు రాసి ప్రచురించేవారు.ఆయన చేసిన ఇతర సంస్కరణ కార్యక్రమాలొక ఎత్తు, అయితే వితంతు పునర్వివాహాలొక ఎత్తు గా ఉండేవి. అప్పటి సమాజంలో చిన్నతనం లోనే ఆడపిల్లలకు వివాహం చేసేసేవారు. వారికీ వయస్సు వచ్చి కాపురాలకు వెళ్లక ముందే భర్తలుమరణించేవారు. వితంతువులై, అనేక అవమానాలు కష్టనష్టాలు ఎదుర్కొనే వారు. దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేసారు.

ఇంట్లోనే మొట్టమొదటి వితంతు వివాహం :

1881 వ సంవత్సరం డిసెంబరు 11న తమ ఇంట్లోనే మొట్టమొదటి వితంతు వివాహం జరిపించారు. . ఈ వివాహం పెద్ద ఆందోళనకు దారి తీసింది అనే చెప్పాలి. ఇంకా చెప్పాలి అంటే పెళ్ళికి వెళ్ళినవాళ్ళందరినీ సమాజం నుండి వెలి వేశారు. సమాజం నుండి విపరీతమైన ప్రతిఘటన ఎదురైనా కూడా పట్టుబట్టి సుమారు 40 వరకు వితంతు వివాహాలు జరిపించారు. ఆత్మూరి లక్ష్మీ నరసింహం, పైడా రామకృష్ణయ్య, బసవరాజు గవర్రాజు వంటి మిత్రులు, మరియు ఆయన విద్యార్ధులు వీరేశలింగానికి అండగా నిలబడి సహకారం అందించారు.
వీరేశలింగం దంపతుల మద్దతు :
ఆయన భార్య బాపమ్మ కు అత్తగారు రాజ్యలక్ష్మి అని తన తల్లి పేరు పెట్టుకున్నారు. కందుకూరి రాజ్యలక్ష్మి కూడా భర్తకు అండగా నిలిచింది.ఆ దంపతుల జనోద్ధరణ చూసి వంటవాళ్ళు, నీళ్ళవాళ్ళు వారి ఇంటికి రావడానికి నిరాకరించినపుడు రాజ్యలక్ష్మమ్మ స్వయంగా గోదావరికి వెళ్ళి నీళ్ళు తెచ్చి మరి పెళ్ళివారికి వంట చేసిపెట్టింది. స్త్రీల కోసం ప్రత్యేకం గా సతీహిత బోధిని అనే పత్రికను కూడా నడిపారు. కార్యదీక్ష,విజ్ఞానత్రుష్ణలు అనేవి ఆయనకు పుట్టుకతోవచ్చినలక్షణాలు.

దురాచారములపై:

కేశవచంద్రసేన్,రామమోహనరాయ్,దేవేంద్రనాద్ ఠాగూర్,ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ల బోధనలు,రచనలు అయన ఆధ్యాత్మిక చింతనలో విప్లవాత్కమైన మార్పును తీసుకురాగలిగాయి. 1887 సం లో సంఘ సంస్కరణ సమాజము ను స్థాపించి. మతమనే ముసుగు వేసుకుని అదోగతిలో ఉన్న హైందవ సమాజములో ఉన్న దురాచారములపై విప్లవ ధ్వజమెత్తారు. ఆయన మూడవిశ్వాసములు,సనాతనాచారములపై జరిపిన పోరాటము ఎప్పటికి మరువలేనిది.

వీరేశలింగం గారి రచనలు:

సంఘసేవ చేయడానికి వీరేశలింగం ఎంత కృషి చేసాడో, సాహిత్యంలోనూ అంతే కృషి చేసారు అని చెప్పక తప్పదు. చదువుకునే రోజుల్లోనే అయన రెండు శతకాలు రాసారు . పత్రికలకు కూడా వ్యాసాలు రాస్తూ ఉండేవారు . వివేకవర్ధనిలో చాల సులభశైలిలో రచనలు చేసేవారు. వ్యావహారిక భాషలో రచనలు చేసిన మొదటి రచయితలలో ఆయన కూడా ఒకరు.

130 కి పైగా గ్రంథాలు:

తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో అద్వితీయ ప్రతిభ ఉన్నవారు వీరేశలింగం గారు.
130 కి పైగా గ్రంథాలు రాసారు ఆయన. ఆన్ని గ్రంథాలు వ్రాసిన వారు తెలుగులో చాల అరుదుగా ఉన్నారు.
రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజా పూర్వ దేశయాత్రలు ఆయన రచనలలో ప్రముఖమైనవిగా చెప్పబడ్డాయి. అనేక సంస్కృత,ఇంగ్లీషు గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. బడి పిల్లల కోసమని వాచకాలు కూడా వ్రాసారు . స్వీయ చరిత్ర వ్రాసారు . ఆంధ్ర కవుల చరిత్ర ను సైతం ప్రచురించారు.
సంగ్రహ వ్యాకరణం కూడా వ్రాసారు . నీతిచంద్రిక లోని సంధి, విగ్రహం భాగాలను చిన్నయసూరి వదిలివేయగా వీరేశలింగం గారు వాటిని పూర్తి చేసారు.
ఒక వ్యక్తిగా, ఒక సంఘసంస్కర్తగా, ఒక రచయితగా వీరేశలింగం పంతులుగారికి అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆయన ఆంధ్రులకు ఆద్యుడు, ఆరాధ్యుడు గా మిగిలారు.
వీరేశలింగం గారి మరణం :
ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి పొందిన కందుకూరి వీరేశలింగం గారు 1919 వ సంవత్సరం మే 27 న మరణించడం జరిగింది.

కందుకూరి వీరేశలింగం గారి ప్రత్యేకతలు:
కందుకూరి వీరేశలింగం గారుమొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి.
కందుకూరి వీరేశలింగం గారుమొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించారు.
కందుకూరి వీరేశలింగం గారుతెలుగులో మొదటి స్వీయ చరిత్ర ఆయనదే .
కందుకూరి వీరేశలింగం గారుతెలుగులో తొలి నవల రాసింది కూడా ఆయనే.
కందుకూరి వీరేశలింగం గారుతెలుగులో తొలి ప్రహసనం రాసింది ఆయనే.
కందుకూరి వీరేశలింగం గారుతెలుగుకవుల జీవిత చరిత్ర రాసిన మొదటి వ్యక్తి గా చెప్పబడ్డారు.
కందుకూరి వీరేశలింగం గారువిజ్ఞాన శాస్త్ర గ్రంథాలను తెలుగులోకి అనువదించిన తొలి తెలుగు రచయిత గా నిలిచారు.
కందుకూరి వీరేశలింగం గారు ఎక్కువగా కందుకూరి కథలు స్త్రీల యొక్క అభ్యుదయాన్ని ప్రోత్సహించేవిగా ఉంటాయి. కొన్ని,కొన్ని ఆంగ్ల మూలాలనుండి అనుసరించినవి కానిఎక్కువగా స్వతంత్ర రచనలే.

1876 వ సంవత్సరం లో బ్రహ్మవివాహం పేరుతో తొలి తెలుగు సాంఘిక నాటకాన్ని ఆయన రచించారు.కన్యాశుల్కం, బాల్య వివాహాలు, వృద్ధ వివాహాలు, వ్యతిరేకించారు. అప్పుడు ఈ నాటకం పెద్దయ్యగారి పెండ్లి పుస్తకం అనే పేరుతో సంచలనం రేపింది. 1876 వ సంవత్సరం లోనేమొట్టమొదటి సరిగా ప్రదర్శితమైన నాటిక ధర్మబోధిని దానినే ప్లీడర్‌ నాటకం అని పిలిచేవారు. న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను తూర్పూరా పట్టినదిగా ప్రఖ్యాతి పొందింది. దీని విశేషం ఏమంటే 1879లో ఈ రచన ముద్రణ చేయబడితే 1880 వ సంవత్సరం లోనే దానిని ప్రదర్శించారు.