Breaking: ఖమ్మంలో ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న తారక్..

మే 28న తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగువారు ఉన్న అన్ని ప్రాంతాలలో నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA)తో పాటు పలువురు ప్రముఖులు కృష్ణుని అవతారంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదగా మే 28న ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు తారక్ ఖమ్మం జిల్లాకు రానున్నారు.

వాస్తవానికి ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని గత ఏడాదే ఆవిష్కరించాల్సి ఉంది. అయితే విగ్రహానికి సంబంధించిన పనులు ఆలస్యమయ్యాయి. దాంతో అప్పుడు విగ్రహావిష్కరణ జరగలేదు. ఈసారి శతజయంతి రోజున ఎలాగైనా ఆవిష్కరించాలని ఉద్దేశంతో పనులను పూర్తి చేశారు. జిల్లాలోని లకారం ట్యాంక్ బండ్‌పై ఈ అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఎంతో పెద్దగా ఆకర్షణీయంగా కనిపించే ఈ విగ్రహం బేస్‌మెంట్‌తో సహా 54 అడుగులు ఎత్తు ఉండటం విశేషం. అంతేకాదు ఈ విగ్రహంలో తల భాగం ఐదు అడుగులు, కాళ్ల భాగం ఐదు అడుగులు పొడవు ఉన్నాయి.

అలానే ఎటువైపు చూసినా 36 అడుగుల పొడవు వెడల్పులతో విగ్రహం చాలా పెద్దగా కనిపించనుంది. మొత్తంగా వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్‌మెంట్​ పై దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహం కోసం నాలుగు కోట్లు ఖర్చు చేశారు.