Janasena: జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో ఎక్కడో క్లారిటి మిస్సవుతున్నట్లుంది. తాజాగా తిరుపతిలో జరిగిన జనవాణి కార్యక్రమంలో పవన్ స్పీచ్ విన్నవారికి ఇదే అభిప్రాయాలు కలిగాయి. ఇంతకీ ఏ విషయంలో క్లారిటి రావాలి. ఏ విషయాల్లో అంటే వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంలోనే. ఇపుడు మిత్రపక్షం బీజేపీతో మాత్రమే పొత్తుంటుందా లేకపోతే తెలుగుదేశంపార్టీని కూడా మిత్రపక్షంగా కలుపుకుని వెళుతున్నారా ? అన్నదే తేలటంలేదు. తిరుపతి మీటింగులో పవన్ అనేక అంశాలపై మాట్లాడారు. వీటిల్లో రెండు విషయాలు మాత్రం పరస్పర విరుద్దంగా ఉన్నాయి.
ఇంతకీ ఆ రెండు విషయాలు ఏమిటంటే మొదటిదేమో వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయం కావాలన్నారు. ఇదే సందర్భంలో టీడీపీ పల్లకీ మోయటానికి తాను సిద్ధంగా లేననని చెప్పారు. అంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీతో పొత్తుండదనే అర్ధముంది. అయితే కాసేపటి తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు తాను శతృవులతో సైతం చేతులు కలుపుతానన్నారు. ఇక్కడ పవన్ శతృవులు ఎవరున్నారు ? తనకు శతృవులుగా పవన్ ఎవరిని భావిస్తున్నారో అర్ధం కావటంలేదు. మొదటినుండి పవన్ కు జగన్ శతృవు అనటంలో సందేహంలేదు.
మరి పవన్ తాజాగా చెప్పిన కొత్తశతృవు ఎవరు ? పవన్ లెక్కలో శతృవుంటే బహుశా చంద్రబాబునాయుడేనేమో. అదే నిజమైతే చేతులు కలపటానికి రెడీ అయినతర్వాత చంద్రబాబు మిత్రుడవుతారే కానీ శతృవు ఎలాగవుతారు ? ఒకే సమయంలో పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయటం పవన్ కు కొత్తేమీకాదు. ఇలాంటి ప్రకటనల వల్ల ఇటు జనసైనికులు, అటు అభిమానులతో పాటు జనాల్లో కూడా అయోమయం పెరిగిపోవటం ఖాయం. అభిమానులదేముంది సినిమాలు చూస్తారు, పవన్ సమావేశాల్లో జిందాబాదులు కొట్టి వెళ్ళిపోతారు. కానీ జనసైనికుల పరిస్దితి అలాగుండదు. రాజకీయంగా తాము ఎవరితో పోరాడాలి ? ఎవరితో మిత్రత్వం వహించాలో తెలీని అయోమయంలో పడిపోతే అది పార్టీకే నష్టం.
ఇక జనాల కోణంలో చూస్తే పవన్ కు ఏమైందని ఆలోచిస్తారు. ఒకేసారి ఎవరైనా ఒకే అంశంపై విరుద్ధమైన ప్రకటనలివ్వగలరా ? ఎవరైనా ఇస్తే జనాలు ఎలాగ రిసీవ్ చేసుకుంటారు ? టీడీపీతో పొత్తు పెట్టుకోదలిస్తే అదే విషయాన్ని బహిరంగంగానే ప్రకటించేయచ్చు కదా ముసుగులో గుద్దులాటలెందుకు ? టీడీపీతో పొత్తుంటుందని ప్రకటన చేస్తే పొత్తులపై రెండుపార్టీల్లోను క్లారిటి వచ్చేస్తుంది. లేదంటే టీడీపీతో పొత్తుండదని చెప్పినా జనసేన నేతల్లో క్లారిటి ఉంటుంది. అందుకు తగ్గట్లుగా తమ కార్యచరణను రూపొందించుకుంటారు.
ఒకవైపు షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో పరస్పర విరుద్ధమైన ప్రకటనలు ఇవ్వటం వల్ల పార్టీకే నష్టమని పవన్ ఆలోచించటంలేదు. లాభమో నష్టమో తాము మాత్రం ఒంటరిగానే పోరాటం చేస్తామని జగన్ ఎన్నోసార్లు ప్రకటించారు. దాంతో ఏమైందంటే అన్నీపార్టీలు తమకు ప్రతిపక్షాలే అనే క్లారిటి వైసీపీ నేతలు, శ్రేణులకు వచ్చేసింది. ఇలాంటి క్లరిటీనే జనసేనకు చాలా అవసరమని పవన్ గుర్తించాలి.