Pavan Kalyan: పవన్ స్లోగన్ వర్కవుటవుతుందా ?

Pavan Kalyan: షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక నినాదాన్ని అందుకున్నారు. అదేమిటంటే ‘ఒక్కసారి జనసేనవైపు చూడండి’ అని. ఎన్నికల సమయంలో పార్టీలిచ్చే స్లోగన్లు ఒక్కోసారి జనాలను విపరీతంగా ఆకట్టుకుంటాయి. జస్ట్ ఒక్క స్లోగన్ కే ఫిడా అయిపోయే జనాల సంఖ్య తక్కువేమీకాదు. 2019లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మూడు స్లోగన్లకు జనాలు బాగా కనెక్టయిపోయారు. ఇంతకీ ఆ స్లోగన్లు ఏమిటంటే ‘ఒక్క ఛాన్స్’ అని.

అలాగే జగన్ సోదరి షర్మిల చెప్పిన ‘బై బై బాబు’ అని ఇదే సమయంలో ‘జగనన్న వదిలిన బాణాన్ని’ అని. మొదటిదేమో జగన్ డైరెక్టుగా జనాలను వైసీపీకి ఓట్లేసి గెలిపించమని అభ్యర్ధించటంలో భాగంగా ఒక్క ఛాన్సివ్వండని రిక్వెస్టు చేసుకున్నారు. ఇక రెండో స్లోగన్ ఏమిటంటే చంద్రబాబునాయుడు పనైపోయిందని, ఓడించాలని షర్మిల జనాలకిచ్చిన పిలుపు. మూడో స్లోగన్ ఏమిటంటే జగన్ జైలులో ఉన్నపుడు తన అన్న తరపున తాను జనాలను కలుస్తున్నట్లు చెప్పుకోవటమే షర్మిల ఉద్దేశ్యం. అందుకనే అన్న తరపున తానున్నానని చెప్పటానికే జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్నారు.

నిజానికి ఈ మూడు స్లోగన్లు బ్రహ్మాండంగా పేలాయి. ఇక 2014లో చంద్రబాబు తరపున జరిగిన ప్రచారంలో చెప్పుకోవాల్సింది ‘జాబు కావాలంటే బాబు రావాలి’ అని. ఈ నినాదం కూడా జనాల్లోకి బాగా ఎక్కింది. ఇదే పద్దతిలో ఇపుడు పవన్ కూడా ఒక్కసారి జనసేనవైపు చూడండి అనే స్లోగన్ను జనాల్లోకి కాయిన్ చేయాలని అనుకుంటున్నట్లున్నారు. పవన్ ఇచ్చిన స్లోగన్ జనాల్లోకి బాగా ఎక్కాలంటే పవన్ ఒక్కళ్ళే చెబుతుంటే సరిపోదు. పవన్+పార్టీ తరపున జనసైనికులే జనాల్లోకి తీసుకెళ్ళాలి. జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలంటే నేతలు, శ్రేణులు ఎక్కడికక్కడ మీడియా సమావేశాలు పెట్టి చెబుతుండాలి.

ఇదే సమయంలో పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగుల ద్వారా హోరెత్తించాలి. వీటన్నింటికన్నా మించినది మరొకటుంది. అదేమిటంటే సోషల్ మీడియా. ఏ పార్టీకి లేనన్ని, ఏ హీరోకి లేనంతగా పవన్ కు వీరాభిమానులున్నారు. వాళ్ళందరినీ ఒక క్రమపద్దతిలోకి తీసుకొచ్చి డిసిప్లిన్ గా పనిచేయించుకోవాలి. ఒక్కసారి జనసేనవైపు చూడండి అనే స్లోగన్ను సోషల్ మీడియాను చూస్తున్న ఐటి విభాగం జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఏ విషయాన్ని అయినా లేదా ఒకే విషయాన్ని పదే పదే జనాల్లోకి తీసుకెళ్ళకపోతే అది జనాల్లో రిజిస్టర్ అవ్వదు.

కాబట్టి స్వాతంత్ర్యదినోత్సవం రోజున పవన్ ఇచ్చిన కొత్త స్లోగన్ను జనాల బుర్రల్లోకి ఎక్కించేవిధంగా బాధ్యత తీసుకోవాల్సింది ఐటి వింగ్ నేతలు, కార్యకర్తలు మాత్రమే. తాము జనసేన సైనికులమని, పవన్ కు వీరాభిమానులమని చెప్పుకుంటేనో లేకపోతే ప్రకటనిలిచ్చుకుంటేనో సరిపోదు. ఆ అభిమానాన్ని కార్యాచరణలో చూపించాలి. అప్పుడే జనాలు జనసేనకు కనెక్టవుతారు. పవన్ తాజాగా ఇచ్చిన స్లోగన్ జనాల్లోకి ఎంతమాత్రం ఎక్కుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే.