pawan kalyan : జనసేన చరిత్ర సృష్టిస్తుందా ?

pawan kalyan :  రాష్ట్ర రాజకీయచరిత్రలో జనసేన చరిత్ర సృష్టించటం ఖాయమా ? అవుననే అంటున్నారు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. అక్టోబర్ 5వ తేదీ అంటే విజయదశమి సందర్భంగా పవన్ బస్సుయాత్ర మొదలుపెడుతున్న విషయం తెలిసిందే. బస్సుయాత్రను కూడా తిరుపతి నుండి మొదలుపెడుతున్నారు. తిరుపతి నియోజకవర్గం అంటే రాయలసీమలోనే కాకుండా యావత్ రాష్ట్రంలోనే ఎంతో ప్రఖ్యాతి కలిగిన ఆధ్యాత్మిక శోభతో నిండిన నియోజకవర్గం అన్న విషయం తెలిసిందే.

ఇలాంటి నియోజకవర్గంలో పర్యటన మొదులుపెడుతున్న కారణంగా తమ యాత్ర గ్రాండ్ సక్సెస్ అవుతుందని పవన్ ఆశిస్తున్నారు. తిరుపతి నియోజకవర్గం నుండే యాత్రను ప్రారంభించటం వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే వైసీపీ రాయలసీమలో చాలా స్ట్రాంగ్ అన్న విషయం తెలిసిందే. ఎంత స్ట్రాంగ్ అంటే ఉన్న 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకంగా 49 నియోజకవర్గాల్లో వైసీపీనే గెలిచింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే జనాభాపరంగా బలిజలు చాలా ఎక్కువగా ఉంటారు. రాయలసీమలో బలిజలన్నా కోస్తా, గోదావరి జిల్లాల్లో కాపులన్నా ఒకటే.

పోయిన ఎన్నికల్లో బలిజలే అయినా జనసేనకు మాత్రం ఓట్లేయలేదు. ఈ కారణంతోనే బలిజల్లో మ్యాగ్జిమమ్ ఓట్లుసాధించే ఉద్దేశ్యంతోనే తనయాత్రను పవన్ వ్యూహాత్మకంగా తిరుపతి నుండి మొదలుపెట్టబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన సామాజికవర్గం ఎక్కడెక్కడయితే ఎక్కువగా ఉందో ఆ నియోజకవర్గాల్లో కచ్చితంగా జనసేన గెలవాలని పవన్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. మొత్తం 175 నియోజకవర్గాల్లో జనాభా రీత్యా తీసుకుంటే సుమారు 40 నియోజకవర్గాల్లో కాపులు నిర్ణయాత్మకమైన పాత్ర పోషించగలరు.

కాబట్టి తన సామాజికవర్గం ఓట్లను వేయించుకోవటంతో పాటు ఇతర సామాజికవర్గాల ఓట్లను కూడా వేయించుకోగలిగితే అధికారంలోకి రావటం ఖాయమనే ఆలోచనలతో పవన్ ఉన్నారు. పవన్ ఆలోచనలు ఎంతవరకు వర్కవుటవుతాయో తెలీదు కానీ అంచనాలు మాత్రం బాగానేవుంది. పవన్ ఆలోచనలన్నీ ఒంటరిగా పోటీచేయటం లేదా పొత్తులో పోటీచేయటంపైనే ఆధారపడుంది. మొత్తంమీద పవన్ యాత్ర చారిత్రత్మాకం ఎలాగంటే పార్టీవర్గాల సమాచారం ప్రకారం పార్టీలో భారీగా చేరికలుంటాయని అనుకుంటున్నారట.

ఇపుడు పార్టీలో కిందస్ధాయిలో కొందరు చేరుతున్నది వాస్తవం. ఇతరపార్టీల నుండి కానీ లేదా సమాజంలో ప్రముఖులు గానీ ఎవరు ఇప్పటివరకు పార్టీలో చేరలేదు. ఇపుడున్నవారిలో పార్టీలో పవన్, నాదెండ్ల తప్ప మూడోవ్యక్తిని జనాలు చెప్పలేరు. ఇలాంటిపార్టీలో బయటపార్టీల నుండి గట్టి నేతలను పవన్ ఎలాగ ఆకర్షించగలరో అర్ధం కావటంలేదు. ఎవరైనా జనసేనలో చేరాలంటే ఏదోక నమ్మకం ఉండాలి. మరి చేరాలని అనుకుంటున్న నేతలకు పవన్ ఏ విధమైన నమ్మకాన్ని కలిగించబోతున్నారో అర్ధం కావటంలేదు.

ఇందులో కూడా మూడురకాలుంటాయి. మొదటిదేమో టికెట్ ఖాయం, రెండోదేమో గెలుపు ఇక మూడోదేమో అధికారంలోకి రావటం. ఈ మూడింటిని అంచనా వేసుకునే ఎవరైనా ఏ పార్టీలోకైనా చేరుతారు. చూద్దాం పవన్ యాత్ర రాజకీయాల్లో ఏ విధంగా చరిత్ర సృష్టిస్తుందో.